విధులకు రాం.. జీతం మింగేస్తాం

5 Jun, 2022 08:25 IST|Sakshi

టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో చైన్‌మ్యాన్‌గా పనిచేస్తున్న సూర్యనారాయణ దాదాపు 8 నెలలుగా పత్తాలేడు. జీతం మాత్రం నెలనెలా దాదాపు రూ. 25 వేలకు పైగా ఠంచనుగా ఆయన ఖాతాకు చేరుతోంది. కారుణ్య నియామకం కింద ఉద్యోగం సంపాదించుకున్న ఈయన విధులకే హాజరుకావడం లేదు. సెలవులకూ దరఖాస్తు చేసుకోలేదు. సంబంధిత విభాగం అధికారి మాత్రం  ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.ఇంజినీరింగ్‌ విభాగంలో ఏకైక వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న మాధవరెడ్డి కొన్ని నెలల క్రితం దిశ యాక్టు కింద కేసు నమోదు కావడంతో అరెస్ట్‌ అయ్యాడు. అనేక సంవత్సరాలుగా ఉద్యోగానికి రాకపోయినా అధికారులు పట్టించుకోలేదని, దీంతో అమ్మాయిలకు వల వేయడమే పనిగా పెట్టుకున్న ఇతని బండారం చివరికి ఓ బాధితురాలి ఫిర్యాదుతో బయటపడిందని నగరపాలక సంస్థలో చర్చించుకుంటున్నారు.  

అనంతపురం సెంట్రల్‌: నగరపాలకసంస్థలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉద్యోగులు తయారయ్యారు. సంబంధిత విభాగపు అధికారిని ప్రసన్నం చేసుకుంటే చాలు ఉద్యోగానికి వచ్చినా రాకపోయినా అడిగే నాథుడు లేరనే ధీమాతో పలువురు ఉన్నారు. పింఛన్‌ విభాగంలో ఓ రెగ్యులర్‌ అటెండర్‌ ఉద్యోగానికి సంవత్సరాల పాటు రాకపోవడంతో ‘సాక్షి’లో కొన్ని రోజుల క్రితం కథనం వెలువడింది. దీంతో ఆయన ఇటీవల కాలంలో చుట్టపుచూపుగానైనా వస్తున్నారు.

అయితే, ఇలాంటి అధికారులు నగరపాలకసంస్థలో కోకొల్లలుగా ఉన్నారని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయా విభాగాలకు చెందిన అధికారులను మచ్చిక చేసుకుని విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. కార్యాలయానికి ఉదయం వచ్చే అధికారుల్లో సగం మంది మధ్యాహ్నానికల్లా కనిపించడం లేదు. కింది స్థాయి సిబ్బందిపై నిఘా లేకపోవడంతో ఇతరత్రా ప్రైవేటు కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. కొంతమంది కార్యాలయంలోనే వేరే విభాగాల్లో పనులు చేయిస్తూ దళారుల అవతారం ఎత్తుతుంటే, మరికొందరు రియల్‌ ఎస్టేట్, ఇతరత్రా పనులు చేసుకుంటున్నట్లు సమాచారం. చాలా నెలలుగా ఇదే పరిస్థితి. కొత్త కమిషనర్‌ భాగ్యలక్ష్మి దృష్టి సారిస్తే ఉద్యోగులు దారికొస్తారని పలువురు చెబుతున్నారు.  

సార్‌ తిట్టాడని రాలేదు 
విధులకు సక్రమంగా రాకపోవడంతో చైన్‌మ్యాన్‌ సూర్యనారాయణను గతంలో ఉన్న కమిషనర్‌ తిట్టారు. దీంతో ఆయన విధులకు రావడం లేదు. ఎలాంటి సెలవు కూడా పెట్టలేదు. దీనిపై అదనపు కమిషనర్‌కు రిపోర్టు చేశాం. సీసీఏ రూల్స్‌ ప్రకారం అతనిపై చర్యలు ఉంటాయి. 
– శాస్త్రి, ఏసీపీ, టౌన్‌ప్లానింగ్‌ 

(చదవండి: రోజూ చిల్లరకొట్టుకు వస్తూ.. నిర్వాహకుడి కూతురిని ట్రాప్‌ చేసి..)
 

మరిన్ని వార్తలు