తపాలా నిద్ర.. అక్రమాల ముద్ర

18 Sep, 2022 09:49 IST|Sakshi

సాక్షిప్రతినిధి, కాకినాడ: పోస్టాఫీసు అంటే నమ్మకానికి చిరునామా. పల్లెల నుంచి నగరం వరకు ఏ చిన్న ఉత్తరం వచ్చినా భద్రంగా అందజేసి విశ్వసనీయత చాటుకునే వ్యవస్థగా మంచి పేరు. ఆధునిక పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరాల పాత్ర లేకపోవటంతో పోస్టాఫీసులు బ్యాంకింగ్‌ రంగంలోకి అడుగుపెట్టాయి. ఇండియన్‌ పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు(ఐపీపీబీ)పేరుతో పల్లెల్లో బ్యాంకింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాంకుల మాదిరి అన్ని నగదు లావాదేవీలు చేపడుతోంది.

అయితే ఈ వ్యవహారాపై పర్యవేక్షణ, జవాబుదారీతనం కొరవడిందనే విమర్శ ఇటీవల బలంగా వినిపిస్తోంది. ఉన్నతాధికారుల అజమాయిషీ అంతంతమాత్రంగా ఉంటోందని తెలుస్తోంది. ఫలితంగా  కొన్ని బ్రాంచిల్లో పోస్టుమాస్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఖాతాదారుల సొమ్ముకు ఎసరు పెడుతున్నారు. ఇలాంటి మోసాలు ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు బ్రాంచిల్లో వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కొవ్వూరు మండలం ధర్మవరం బ్రాంచిలో పోస్టుమాస్టర్‌ ఏకంగా నకిలీ పాస్‌పుస్తకాలు తయారుచేసి కోటిన్నర లూటీ చేయడం పోస్టల్‌శాఖనే ఒక్క కుదుపు కుదిపేసింది. జిల్లాల పునర్విభజనకు ముందు నుంచి బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహిస్తోన్న బ్రాంచిల్లో ఎక్కడోచోట ఈ బాగోతాలు బయటపడి ఖాతాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.  

బయటపడిన కొన్ని బాగోతాలు 
ఈ ఏడాది మేలో అమలాపురం పోస్టల్‌ డివిజన్‌ పరి«ధిలోని అయినవిల్లి మండలం విలస సబ్‌ పోస్టాఫీసు ఐపీపీబీలో రూ.1.18 కోట్లు దుర్వినియోగమయ్యాయి. హెడ్‌ పోస్టాఫీసులో సిస్టమ్‌ అడ్మిని్రస్టేటర్‌ ఖాతాదారుల సొమ్ములను సన్నిహితులు, బంధువుల ఖాతాలకు బదిలీచేసి అక్రమానికి పాల్పడ్డాడు. ఇందులో ఇద్దరు పోస్టల్‌ అసిస్టెంట్లు సస్పెండయ్యారు. ఆరుగురికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. సూత్రధారి సిస్టమ్‌ అడ్మినిస్టేటర్‌ ఇప్పటికీ పరారీలో ఉండటం విస్మయాన్ని కలిగిస్తోంది. డిజిటల్‌ సంతకాల పాస్‌ వర్డ్‌లను తెలుసుకుని సిస్టమ్‌ అడ్మి్రస్టేటర్‌ అక్రమాలకు పాల్పడ్డాడని గుర్తించారు. 

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డిగూడెంలో 70 మంది ఖాతాదారులు మోసపోయిన వైనం ఆరు నెలల క్రితం బయటపడింది. డిపాజిట్‌ సొమ్ము డ్రా చేసేందుకు వెళ్లేసరికి అసలు ఖాతాల్లో సొమ్ములు లేవని తేలడంతో వీరంతా నివ్వెరపోయారు. బాధితులు తాడేపల్లిగూడెం హెడ్‌పోస్టాఫీసుకు ఫిర్యాదు చేయగా విచారణ జరుగుతోంది. 

నల్లజర్ల మండలం చీపురుగూడెంలో ఖాతాదారు ల డిపాజిట్లను పాస్‌బుక్‌లో నమోదు చేసినా ఐపీపీబీ ఖాతాల్లో జమ చేయలేదు .కల్లూరు సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ చిగురుపల్లి గోవర్థన్‌ తన ఖాతాలో డిపాజిట్‌ సొమ్ము లేదని గుర్తించడంతో బ్రాంచి పోస్టుమాస్టర్‌ ఇందిర అవినీతి వ్యవహారం బహిర్గతమైంది. విచారణ జరుగుతోంది.

గోకవరం సబ్‌ పోస్టాఫీసులో తపాలా ఉద్యోగి (జీడీఎస్‌–పేకర్‌) ఐపీపీబీ ఖాతాల నుంచి రూ. 20 లక్షలు కాజేసిన వైనాన్ని  గతేడాది డిసెంబర్‌లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. డమ్మీ డిపాజిట్లతో  లక్షల్లో విత్‌డ్రా చేసి తపాలా శాఖకు షాక్‌ ఇచ్చాడు.

తాజాగా కొవ్వూరు మండలం ధర్మవరం బ్రాంచిలో పోస్టు మాస్టర్‌ ఖాతాదారులకు కుచ్చుటోపీ వేశారు. పోస్టు మాస్టర్‌ ఎస్‌కే మీరావలి నిర్వాకంతో సుమారు 750 మంది డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు. పెదవేగి ఆనందరావు ధర్మవరం బ్రాంచిలో డిపాజిట్‌ చేసిన రూ.5లక్షలు కొవ్వూరు ప్రధాన కార్యాలయంలో పరిశీలిస్తే జమ కాలేదని తేలడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు కోటి రూపాయలు దాటి ఉంటుందని తెలుస్తోంది. దీనిపై అసిస్టెంట్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ విచారిస్తున్నారు. 

2002లో అమలాపురం ప్రధాన తపాలా కార్యాలయంలో ఇందిరా వికాస్‌ పత్రాలు(ఐకేపీ) పేరుతో రూ.1.50 కోట్లు దురి్వనియోగమయ్యాయి. గడువుతీరిన ఐకేపీ పత్రాలను అడ్డం పెట్టుకుని సొమ్ము కాజేయడం అప్పట్లో సంచలనమైంది. ఇద్దరు పోస్టల్‌ ఉద్యోగులను తొలగించారు.  ఐదుగురిని సస్పెండ్‌ చేశారు. 31 మందిని బాధ్యులుగా నిర్ధారించి జీతాల నుంచి రికవరీ చేశారు.  81 మంది బాధితుల్లో నలుగురు ఇప్పటికే చనిపోయారు.  

నిరంతర పర్యవేక్షణ
బ్రాంచిల్లో ఐపీపీబీల కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణతో అవకతవకలకు తావులేకుండా చూస్తున్నాం. ప్రతి నెలా నాలుగైదు బ్రాంచిల్లో ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నాం. నాతో పాటు నలుగురు ఇనస్పెక్టర్‌లు, సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి ఐపీపీబీ ఖాతాదారుల పాస్‌పుస్తకాలు, రికార్డులను పరిశీలిస్తున్నాం. బ్రాంచి పోస్టాఫీసులకు వెళ్లి పరిశీలన జరిపే వరకు కూడా బృందం తనిఖీలకు వెళుతున్న సమాచారం గోప్యంగా ఉంచుతాం. కాకినాడ జిల్లాలో షెడ్యూల్‌ ప్రకారం చేస్తుండబట్టే   అవకతవకలకు ఆస్కారం ఉండటం లేదు. 
నాగేశ్వరరెడ్డి, పోస్టల్‌ సూపరింటెండెంట్, కాకినాడ 

ఇలా చేస్తే అడ్డుకట్ట
ఐపీపీబీ డివిజన్‌కు ఒక కార్యాలయం మాత్రమే ఉంది. దీంతో పెద్దగా పర్యవేక్షణకు ఆస్కారం ఉండటం లేదు. ఇక్కడ ఉద్యోగులను  కూడా అవుట్‌ సోర్సింగ్‌లో తీసుకుంటున్నారు. ఐపీపీబీ కార్యాలయాల్లో సిబ్బందిని పోస్టల్‌ బ్రాంచ్‌ కార్యాలయాలు, సబ్‌ పోస్టాఫీసులకు అనుసంధానం చేయటంలో లోపాలున్నాయి. తరచూ పోస్టల్‌ డిపాజిట్లు, అకౌంట్లపై అధికారుల తనిఖీలు ఉండాలి. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు పోస్టల్‌ కార్యాలయాల్లో రికార్డులనే కాకుండా క్షేత్ర స్థాయికి వెళ్లి ఖాతాదారుల పాసుపుస్తకాలను కూడా తనిఖీ చేయాలి. వాణిజ్య బ్యాంక్‌ల మాదిరిగానే పోస్టల్‌ ఖాతాదారుల మొబైళ్లకు మెసేజ్‌ అలర్టు ఉన్నప్పటికీ నిధులు కాజేసే కొందరు ఉద్యోగులు ఈ మెసెజ్‌ రాకుండా సర్వర్‌ను నియంత్రిస్తున్నారని తెలుస్తోంది. ఈ విధానాన్ని కట్టడి చేయాల్సి ఉంది.పాస్‌వర్డు కింది స్థాయి సిబ్బందికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  

ఎందుకిలా మోసం జరుగుతోంది... 
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐపీపీబీలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడమే ప్రధాన కారణం. సబ్‌ పోస్టాఫీసును సూపరింటిండెంట్, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోసాఫీసెస్‌ వంటి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. వీరు సబ్‌ పోస్టాఫీసు, పోస్టాఫీసులను ప్రతి మూడు, అరు నెలలకు  తనిఖీ చేస్తున్నా ఐపీపీబీ ఖాతాల ఆన్‌లైన్‌ లావాదేవీలపై దృష్టి పెట్టడం లేదు.

ఈ విధానమే బ్రాంచి స్థాయిలో అవకతవకలకు ఆజ్యం పోస్తోందని తెలుస్తోంది. తపాలా ఉద్యోగులు, ఐపీపీబీ పర్యవేక్షకుల మధ్య సమన్వయం లేకపోవడం కొంప ముంచుతోంది. ఐపీపీబీ రాక ముందు (పోస్టల్‌ లావాదేవీలు ఆన్‌లైన్‌ కాక ముందు) తపాల కార్యాలయాల ద్వారా సేవింగ్స్‌ బ్యాంకు, రికరింగ్‌ డిపాజిట్, ఫిక్సిడ్‌ డిపాజిట్‌ ఖాతాలను తెరిచేవారు. ఆఫ్‌లైన్‌లో లావాదేవీలు జరిగేటప్పుడు ఈ తరహా అవకతవకలు చోటుచేసుకోలేదు. ఆన్‌లైన్, ఐపీపీబీ వ్యవస్థ వచ్చాక ఖాతాల నుంచి సొమ్ము మాయవుతుండటం ఉన్నత స్థాయి వైఫల్యంగానే కనిపిస్తోంది.    

మరిన్ని వార్తలు