పీఆర్సీపై హర్షాతిరేకాలు

9 Feb, 2022 03:43 IST|Sakshi
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న జీవీఎంసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

ద్వారకానగర్‌ (విశాఖ దక్షిణ): ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో మెరుగైన పీఆర్సీ ప్రకటించడాన్ని హర్షిస్తూ రాష్ట్ర వైఎస్సార్‌టీయూ అనుబంధ జీవీఎంసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ అదనపు ప్రధాన కార్యదర్శి గొండు సీతారాం మాట్లాడుతూ.. ఊరటనిచ్చేలా పీఆర్సీ ఇవ్వడం, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఐదు డీఏలు ఒకేసారి చెల్లింపునకు అంగీకారం తెలపడం హర్షణీయమన్నారు.

పీఆర్సీ పాత పద్ధతిలో ఐదేళ్లకోసారి అమలుకు అంగీకరించటం, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వీలైనంత ఆర్థిక లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకోవడం, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీసుల రెగ్యులరైజేషన్, హెచ్‌ఆర్‌ఏ అంశాలు, పెన్షనర్లకు అదనపు క్వాంటం, సీపీఎస్‌ పునరుద్ధరణకు రూట్‌ మ్యాప్, పూర్తిస్థాయిలో హెల్త్‌ కార్డులు స్ట్రీమ్‌ లైన్‌లోకి తీసుకురావడం, కోవిడ్‌తో మరణించిన ఉద్యోగుల వారసులకు వీలైనంత త్వరితగతిన ఉద్యోగాలు కల్పించడం, పెన్షనర్లు ఎదురుచూస్తున్న మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ను పొడిగించేందుకు అంగీకరించడం, పీఆర్సీ రిలేటెడ్‌ 9, ఇతర 4 అంశాలు తదితర డిమాండ్లపై ప్రభుత్వం నుంచి అనుకూల సంకేతాలు రావడం శుభపరిణామం అన్నారు, మంత్రివర్గ ఉప సంఘం, చీఫ్‌ సెక్రటరీతో జరిగిన చర్చల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అంగీకార సంతకాలు చేసి బయటకొచ్చి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ ప్రతినిధులు డి.పోలరావు, ఎల్లయ్య, బి.తాతారావు, వెంకునాయుడు, సత్యం, పి.ఎల్లారావు, కె.రామునాయుడు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు