అప్పారెల్‌ పార్క్‌లతో ఉపాధి అవకాశాలు

20 Aug, 2021 03:30 IST|Sakshi
బ్రాండిక్స్‌ పరిశ్రమలో ఉత్పత్తులను పరిశీలిస్తున్న నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌

దేశంలో మరిన్ని పార్కులు రావాలి

‘బ్రాండిక్స్‌’ను సందర్శించిన నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌

అచ్యుతాపురం: దేశంలో మరిన్ని అప్పారెల్‌ పార్కులు ఏర్పాటు చేయడం అవసరమని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ అన్నారు. ఆయన గురువారం విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలోని బ్రాండిక్స్‌ అప్పారెల్‌ పార్క్‌లో పరిశ్రమలను సందర్శించారు. బ్రాండిక్స్‌ ఇండియన్‌ పార్టనర్‌ దొరస్వామి ఆయనకు అక్కడ జరుగుతున్న ఉత్పత్తుల గురించి వివరించారు. 20 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించినట్టు చెప్పారు. నీతి ఆయోగ్‌ సీఈవో మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం తరువాత పారిశ్రామిక రంగమే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉందన్నారు.

బ్రాండిక్స్‌ అనుసరిస్తున్న విధానంలో మరిన్ని పార్క్‌లు ఏర్పాటు కావాలన్నారు. నామమాత్రపు చదువుతో కార్పొరేట్‌ స్థాయి పరిశ్రమలో ఉపాధిని అందిపుచ్చుకున్న మహిళలను ఆయన అభినందించారు. పలువురు మహిళా కార్మికులతో మాట్లాడి వసతులపై ఆరా తీశారు. పరిశ్రమ యాజమాన్యం కార్మికులకు కల్పిస్తున్న రవాణా, రక్షణ, క్యాంటీన్‌ సౌకర్యాలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రోత్సాహకాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బ్రాండిక్స్‌ అప్పారెల్‌ పార్క్‌ శ్రీలంక పార్టనర్స్‌తో వీడియోకాల్‌లో మాట్లాడి పలు అంశాలను తెలుసుకున్నారు. ఆయన వెంట జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు ఉన్నారు. 

మరిన్ని వార్తలు