విప్పపువ్వు.. గిరిజనుల కల్పతరువు 

20 Feb, 2023 05:51 IST|Sakshi
విప్ప పువ్వు

మూడు నెలల పాటు అడవి బిడ్డలకు ఉపాధి 

విప్పపువ్వులో ఎన్నో పోషకాలు 

బుట్టాయగూడెం: ఆదివాసీ గిరిపుత్రులకు అక్కడ లభించే ఉత్పత్తులు జీవనాధారం కల్పిస్తున్నారు. అడవిలో లభించే అటవీ ఉత్పత్తులు సేకరించి వాటిని విక్రయిస్తూ ఉపాధి పొందుతుంటారు. కొందరు అడవిలో ఉండే వెదురుతో బుట్టలు, చాటలు వంటివి నైపుణ్యంలో తయారు చేసి విక్రయిస్తారు. మరి కొందరు తేనె సేకరణ, తునికాకు, అడ్డాకుతో పాటు పలు రకాల ఉత్పత్తులు సేకరిస్తారు.

కాలానికి అనుగుణంగా ఉపాధిని ఇచ్చే వృక్షాల్లో ఇప్పచెట్లు ప్రధానమైనవి. వేసవిలో వీటి ద్వారా గిరిజనులు ఉపాధి పొందడానికి అనేక అవసరాలు ఉన్నాయి. విప్పపువ్వును గిరిజనులు తెల్లవారుజామునే అడవిలోకి వెళ్ళి సేకరిస్తారు. తెల్లవారుజామున చెట్లపై నుండి కిందపడిన ఇప్పపువ్వును మధ్యాహ్నానికి సేకరించి ఇంటికి తెచ్చి ఎండబెడతారు.  

మూడు నెలల పాటు ఉపాధి 
మన్యం ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు విప్పచెట్ల ద్వారా మూడు నెలల పాటు ఉపాధి దొరుకుతుంది. ఖరీఫ్, రబీ పనులు ముగిసే సమయానికి  విప్ప చెట్లు విరగపూస్తాయి. వీటి పువ్వులు గాలికి నేలరాలుతుంటాయి. ఈ పువ్వులను గిరిజనులు సేకరిస్తారు. వీటితోపాటు మొర్రి పండ్లు సేకరించి ఇంటికి తీసుకువస్తుంటారు. వీటిని సేకరించి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విక్రయించి ఉపాధి పొందుతుంటారు.  

విప్పపువ్వుతో ఔషధాలు తయారీ 
గిరిజనులు సేకరించిన ఇప్పపువ్వును జీసీసీల ద్వారా కొనుగోలు చేస్తుంటారు. ఇప్పపువ్వులో ఎన్నెన్నో ఔషధ విలువలు ఉండడంతో ఈ పువ్వును ఔషధాల తయారీకి విక్రయిస్తారు. ఇప్పపువ్వు నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం వంటి వ్యాధులకు ఉపయోగిస్తారు.  విప్పపువ్వుతో దంతాలను శుభ్రం చేసుకోవడంతో దగ్గుకు, దంతాలకు సంబంధించిన వ్యా«ధులుకు ఔషధంగా పనిచేస్తుంది. సచ్ఛమైన  విప్పపువ్వుతో తయారు చేసిన సారాను సేవిస్తే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని గిరిజనులు అంటున్నారు.  

వైద్యశాస్త్రంలోనూ ప్రాధాన్యం 
వైద్యశాస్త్రంలోనూ విప్పపువ్వు ప్రాధాన్యతను సంపాదించుకుంది. అడవిలో లభించే ఇప్పపువ్వుల గింజల నుంచి తీసిన నూనెలో ఎన్నో పోషక విలువలున్నట్లు శాస్త్రీయంగా నిరూపించారు. భారత శాస్త్రీయ సాంకేతిక మంత్రిత్వ శాఖ సహాయంతో 1999లో నిర్వహించిన పరిశోధనలో ఎండిన ఇప్పపువ్వుల నుంచి పంచదారను తయారు చేసి జామ్, కేక్‌లు, చాక్లెట్‌లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు.  విప్పపువ్వు ఎక్కువ­కా­లం నిల్వ ఉండడానికి మధ్యమధ్యలో ఎండిన వేప ఆకును వేస్తే నిల్వ ఉంటుందని తెలుసుకున్నారు.  

పశ్చిమ మన్యంలో 20 వేలకు పైగా విప్ప చెట్లు 
పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంతో పాటు పాపికొండల అభయారణ్యంలో ఇప్పచెట్లు దాదాపుగా 20 వేలకు పైగా ఉండవచ్చని అంచనా. ముఖ్యంగా బుట్టాయగూడెం మండలం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఈ ఇప్పచెట్లు ఆధికంగా ఉన్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా 5 వేల చెట్ల వరకూ అటవీప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో నాటి వాటిని పెంచుతున్నారు.

గిరిజనులు సేకరించిన ఈ ఇప్పపువ్వులను జీసీసీ అధికారులే కాదు బయటి నుండి అనేక మంది వ్యాపారులు కూడా కొనుగోలు చేసి తీసుకువెళ్తుంటారు. ఇప్పపువ్వులో పోషకాలు ఎక్కువగా ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నట్లు గిరిజనులు చెప్తున్నారు. ప్రస్తుతం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గుత్తుకోయలు, బుట్టాయగూడెం మండలంలో కొండరెడ్లు ఈ పువ్వులను సేకరిస్తూ జీవనోపాధి పొందుతున్నారు.  

5 వేల ఇప్ప మొక్కలు నాటాం 
పశ్చిమ అటవీ ప్రాంతంలో సహజ సిద్ధంగా పెరిగిన ఇప్పచెట్లే కాకుండా అడవిలో ఉండే ఖాళీ ప్రదేశాల్లో సుమారు 5 వేల వరకూ విప్పమొక్కలను నాటి పెంచుతున్నాం. ఇప్పచెట్ల నుంచి వచ్చే పువ్వుల ద్వారా గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో గుత్తుకోయలు, బుట్టాయగూడెం మండలాల్లో కొండరెడ్లు ప్రస్తుతం విప్పపువ్వు సేకరణలో ఉపాధి పొందుతున్నారు.  
– దావీదురాజు నాయుడు,అటవీ శాఖ డీఆర్‌ఓ, పోలవరం  
 
జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలి 
మా గ్రామ సమీపంలోని అడవుల్లో విప్పపువ్వుతోపాటు పలు ఉత్పత్తులు లభిస్తున్నాయి. విప్పపువ్వుతోపాటు పలు ఉత్పత్తులను గతంలో కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం జీసీసీ అధికారులు ఇప్పపువ్వు కొనుగోలు చెయ్యడంలేదు. ప్రస్తుతం ఇప్పపువ్వు సీజన్‌ ప్రారంభమవుతుంది. జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతున్నాం. 
– కెచ్చెల బాలిరెడ్డి, కొండరెడ్డి గిరిజనుడు– మోదేలు   

మరిన్ని వార్తలు