డ్రైన్‌ ఉంటే మాకేంటి...ఆక్రమించి మరీ భవన నిర్మాణం!

18 Dec, 2022 10:07 IST|Sakshi

వారం రోజులుగా పనులు

అనుమతులు లేకుండానే కడుతున్నా పట్టించుకోని అధికారులు

ఒంగోలు టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల తీరుపై ఆరోపణలు

ఒంగోలు సబర్బన్‌: నగరంలో అక్రమ కట్టడాలు యథేచ్చగా సాగుతున్నాయి. నగర పాలక సంస్థ అధికారుల అనుమతులు లేకుండానే భారీ నిర్మాణాలు పూర్తవుతున్నాయి. కళ్ల ముందే పెద్ద పెద్ద భవనాలు వెలుస్తున్నా నగర పాలక సంస్థ అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. నగరంలో ఒకచోట కాదు అనేక ప్రాంతాల్లో అనుమతుల్లేని నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.

తనిఖీలకు వెళ్లిన సమయంలో తెరవెనుక ఒప్పందాలు కుదుర్చుకుని వస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్‌లో అక్రమంగా నిర్మిస్తున్న భారీ భవనం. దక్షిణ బైపాస్‌ ప్రగతి భవన్‌కు వెళ్లే ప్రధాన గేటుకు ఆనుకొని దానిని నిర్మిస్తున్నారు. వారం రోజులుగా పనులు జరుగుతున్నాయని తెలిసి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఒకటికి నాలుగు సార్లు అక్కడికి వెళ్లి వచ్చారే తప్ప నిర్మాణాన్ని ఆపే ప్రయత్నం చేయలేదంటే.. దాని మతలబు ఏమై ఉంటుందో స్పష్టమవుతోంది.

దీనికి తోడు దక్షిణ బైపాçస్‌లో ఉత్తరం వైపున ఆనుకొని ఒంగోలు నగరానికి చెందిన ప్రధాన డ్రైనేజీ కాలువ ఉంది. మామిడిపాలెం, హౌసింగ్‌ బోర్డు, ఎస్‌ఎస్‌ ట్యాంకు–1 పరిసర ప్రాంతాల నుంచి మురుగు నీరు, వర్షపు నీరు ఈ డ్రైనేజి నుంచే ప్రవహించాల్సి ఉంది. అయితే దాదాపు 10 అడుగుల వెడల్పు ఉండే దీనికి రెండు సిమెంట్‌ పైపులు వేసి తాత్కాలికంగా మట్టితో కప్పేసి మరీ నిర్మాణం చేస్తున్నారు. పెద్ద వరద వస్తే వర్షపు నీరు సాఫీగా వెళ్లే వీలు లేక ప్రభుత్వ భవనాల సముదాయం, నాగార్జున యూనివర్శిటీ స్టడీ సెంటర్, నవోదయ కళాశాలల్లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా నగరంలో అక్రమ నిర్మాణాలకు కట్టడి వేయాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతున్నా టౌన్‌ ప్లానింగ్‌లో ఉన్నతాధికారి స్పందించకపోవడం గమనార్హం.

నగర పాలక సంస్థ ఆదాయానికి గండి: 
అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేసుకుంటూ పోతే నగర పాలక సంస్థ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఫ్లింత్‌ ఏరియాను బట్టి, అంతస్తుల భవనాల లెక్కన కార్పొరేషన్‌కు ఫీజులు చెల్లించాలి. నగర పాలక సంస్థ ఆదాయానికి భారీగా తూట్లు పడుతున్నా తమ జేబులు నిండితే చాలు అన్న చందంగా ఉంది టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల తీరు. 

నోటీసులు ఇచ్చి ఆపుతాం.. 
అక్రమంగా జరుగుతున్న భవన నిర్మాణాలను ఆపేస్తాం. నిబంధనలకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకుంటాం. దక్షిణ బైపాస్‌లో ప్రగతి భవన్‌ ముందు జరుగుతున్న భవన నిర్మాణం విషయం నా దృష్టికి వచ్చింది. వెంటనే నోటీసులు ఇవ్వమని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు చెప్పా. నోటీసు ఇవ్వటంతో పాటు అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేస్తాను. టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది అక్రమాలకు పాల్పడిన విషయం నా దృష్టికి రాలేదు. ఆ విషయంపై కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటాను.  
– ఎం.వెంకటేశ్వరరావు, కమిషనర్, ఒంగోలు నగర పాలక సంస్థ  

మరిన్ని వార్తలు