Krishna Water Dispute: కృష్ణా జల వివాదాలకు ముగింపు!

17 May, 2022 05:07 IST|Sakshi

20న కృష్ణా బోర్డు రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ భేటీ

శ్రీశైలం, సాగర్‌లో విద్యుదుత్పత్తి నియమావళిపై చర్చ

మళ్లించే వరద జలాల లెక్కింపుపై విధి విధానాలు

రెండు ప్రాజెక్టుల నిర్వహణకు సీడబ్ల్యూసీ తయారు చేసిన విధానంపై సమీక్ష

సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు ముగింపు పలికేందుకు కృష్ణా బోర్డు సిద్ధమైంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుదుత్పత్తిని నియంత్రణ, నిర్వహణ నియమావళి ద్వారా ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తే జల వివాదాలకు తావే ఉండదని కృష్ణా బోర్డు భావిస్తోంది.

మళ్లించే వరద జలాలను లెక్కలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి, తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు బోర్డు సభ్యులు ఆర్కే పిళ్‌లై కన్వీనర్‌గా, ఎల్బీ ముయన్‌తంగ్, రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు, జెన్‌కోల సీఈలు సభ్యులుగా రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఆర్‌ఎంసీ)ని నియమించింది. ఈ కమిటీ ఈనెల 20న హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో సమావేశమవుతోంది.

బచావత్‌ ట్రిబ్యునలే ప్రామాణికంగా
బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. వాటిని ప్రామాణికంగా తీసుకున్న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి ఏ ప్రాజెక్టుకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలో  విధి విధానాల ముసాయిదా (రూల్‌ కర్వ్‌ డ్రాఫ్ట్‌)ను రూపొందించింది. దీనిపై అధ్యయనం చేసి మార్పులు ఉంటే చేసి, నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆర్‌ఎంసీని బోర్డు ఆదేశించింది. దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వరద జలాలను వాడుకునే స్వేచ్ఛను బచావత్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో కృష్ణాకు వరద వచ్చే రోజుల్లో జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి జలాలు కలుస్తున్నప్పుడు.. రెండు రాష్ట్రాలు మళ్లించే వరద జలాలను కోటా కింద లెక్కించాలా? వద్దా? అనే అంశంపైన కూడా అధ్యయనం చేసి, నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆర్‌ఎంసీని ఆదేశించింది. ఆర్‌ఎంసీ నివేదికను బోర్డులో చర్చించి.. అమలు చేయడం ద్వారా జల వివాదాలకు చరమగీతం పాడాలని నిర్ణయించింది. 

విద్యుదుత్పత్తి నియంత్రణే కీలకం
గతేడాది శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్‌ స్టోరేజీ స్థాయిలో ఉన్నా, ఎగువ నుంచి వరద రాకున్నా.. బోర్డు అనుమతి తీసుకోకుండానే తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేసింది. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపినా  తెలంగాణ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి కొనసాగించింది. విద్యుదుత్పత్తి చేయొద్దని బోర్డు జారీ చేసిన ఆదేశాలనూ తుంగలో తొక్కింది. ఇష్టారాజ్యంగా శ్రీశైలం, సాగర్, పులిచింతల్లో తెలంగాణ విద్యుదుత్పత్తి చేయడం వల్ల ప్రకాశం బ్యారేజీ ద్వారా వందలాది టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. దీనిపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.

తెలంగాణ తీరుపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసింది. 2022–23 నీటి సంవత్సరంలో కూడా ఈ పరిస్థితి పునరావృతం కాకుండా బోర్డు చర్యలు చేపట్టింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో విద్యుదుత్పత్తికి 15 రోజుల్లోగా నియమావళిని రూపొందించాలని ఆర్‌ఎంసీని కృష్ణా బోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ ఆదేశించారు. 

మరిన్ని వార్తలు