భక్తుల అభిప్రాయాలకే ప్రాధాన్యం

21 Dec, 2021 04:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అన్ని ఆలయాల్లో ‘డయల్‌ యువర్‌ ఈవో’ కార్యక్రమం

సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రతి నెలా రెండు విడతలుగా శనివారం రోజున నిర్వహణ

ఈవోలకు దేవదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాలు  

సాక్షి, అమరావతి: దేవాలయాల్లో భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేసేందుకు, పరిష్కరించేందుకు వీలుగా ప్రతి నెలా రెండు విడతలుగా ‘డయల్‌ యువర్‌ ఈవో’ కార్యక్రమం నిర్వహించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. రోజువారీ కార్యక్రమాల నిర్వహణలో భక్తుల అభిప్రాయాలకు ప్రాధాన్యం కల్పించనుంది. ఈ మేరకు దేవదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ వివిధ ఆలయాల కార్యనిర్వహణాధికారుల(ఈవో)కు ఆదేశాలు జారీ చేశారు. మొదట దేవదాయశాఖ పరిధిలోని విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, కాణిపాకం, మహానంది, కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం, విశాఖపట్నం కనకమహాలక్ష్మీ, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయాల్లో ఈ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని సూచించారు.

క్రమంగా అన్ని ఆలయాల్లోనూ నిర్వహించాలన్నారు. ప్రతి నెలా ఒకటి రెండు శనివారాల్లో ఏదో ఒక రోజు మొదటి విడత, మూడు నాలుగు శనివారాల్లో ఏదో ఒక రోజు రెండో విడతగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆదేశించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా విస్తృత ప్రచారం కల్పించాలని, వీలైతే స్థానిక టీవీ చానళ్లలో ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.  

కమిషనర్‌ క్షేత్రస్థాయి తనిఖీలు 
జిల్లాల్లోని ఆలయాల నిర్వహణ, దేవదాయ శాఖ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారం సహా ఇతర అంశాలను పరిశీలించేందుకు కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ జనవరిలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టనున్నారు. ఆ సందర్భంగా ఆప్రాంతంలోని రెండు మూడు ఆలయాలకు ఆయన వెళ్లనున్నారు. కేవలం ఒక్క రోజు ముందస్తు సమాచారంతో అన్ని జిల్లాల్లోని అసిస్టెంట్‌ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఆర్‌జేసీ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఆలయాల్లో భక్తులకు సౌకర్యాల కల్పనతో పాటు కార్యాలయ శుభ్రత, రికార్డు రూం నిర్వహణ, పెండింగ్‌ ఫైళ్ల పరిష్కారం, కార్యాలయ ప్రాంగణంలో గ్రీనరీ, సిబ్బంది డ్రెస్‌ కోడ్, సీసీ కెమెరాల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించనున్నారు.   

మరిన్ని వార్తలు