Andhra Pradesh: థ్యాంక్యూ సీఎం సార్‌..!

3 Jul, 2022 04:35 IST|Sakshi
తాడేపల్లిలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లు, పాల్గొన్న ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ జే పద్మాజనార్ధనరెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లోని ఏడు వేల మంది ఎనర్జీ అసిస్టెంట్ల క్రమబద్ధీకరణ

అన్ని జిల్లాల్లో ఉద్యోగుల ప్రదర్శనలు  

వీరి రాకతో మూడేళ్లుగా తగ్గుతున్న విద్యుత్‌ సమస్యలు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో ఉన్న ఎనర్జీ అసిస్టెంట్లలో అర్హత సాధించిన దాదాపు 7 వేల మందిని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసింది. దీంతో వీరంతా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ‘థ్యాంక్యూ సీఎం సార్‌’ నినాదంతో అన్ని జిల్లాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నిజానికి.. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థలో భాగంగా వీరిని విద్యుత్‌ శాఖ ద్వారా నియమించారు. వీరికి విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు అవసరమైన శిక్షణనివ్వడంతో వీరు పట్టణాలు, గ్రామాల్లో అంతరాయాల్లేకుండా విద్యుత్‌ సరఫరా అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. భవిష్యత్తులో వీరికి లైన్‌మెన్, సీనియర్‌ లైన్‌మెన్, లైన్‌ ఇన్‌స్పెక్టర్, లైన్‌ సూపర్‌వైజర్, ఫోర్‌మెన్‌గా పదోన్నతులు పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. 

ఒక్కో అసిస్టెంట్‌ 1,500 కనెక్షన్ల బాధ్యత
మరోవైపు.. రాష్ట్రంలో 1.91 కోట్ల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సుమారు 1.52 కోట్ల గృహ విద్యుత్‌ వినియోగదారులున్నారు. ప్రతి ఎనర్జీ అసిస్టెంట్‌ను గరిష్టంగా 1,500 విద్యుత్‌ కనెక్షన్లకు బాధ్యుడిని చేశారు. కనీసం 30–40 ట్రాన్స్‌ఫార్మర్లను ఇతను పర్యవేక్షించవచ్చు. 5–10 కిలోమీటర్ల పరిధిలో లైన్‌పై చెట్లు పడినా, జంపర్లు తెగిపోయినా బాగుచేయడం, ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయినా, చెడిపోయినా, మీటర్లు ఆగిపోయినా కొత్తవి బిగించడం వంటి విధులతో పాటు మరే ఇతర విద్యుత్‌ సమస్యలు తలెత్తినా అతని పరిజ్ఞానం మేరకు బాగుచేస్తాడు.

వీలుకాని పక్షంలో అధికారులకు వెంటనే సమాచారం అందించి నిపుణులు త్వరగా వచ్చేలా చూస్తాడు. కరోనా ఉధృతంగా ఉన్నప్పుడు కూడా వీరు తగిన జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వర్తించారు. విద్యుత్‌ సరఫరా ఇబ్బందులకు సంబంధించి వలంటీర్ల ద్వారాగానీ లేదా నేరుగాగానీ గ్రామ/వార్డు సచివాలయానికి ఫిర్యాదు వసేŠత్‌ క్షణాల్లో సమస్యలను పరిష్కరించేలా వీరికి విధులు నిర్ధేశించారు.

భారీగా తగ్గిన అంతరాయాలు
సచివాలయాల వ్యవస్థ రాకతో విద్యుత్‌ సమస్యలు భారీగా తగ్గుతున్నాయి. గతంలో రెండు, మూడు ఊళ్లకు ఒక లైన్‌మెన్‌ ఉండేవారు. సమస్య వస్తే వారు దూరం నుంచి వచ్చి సరిచేయడానికి సమయం పట్టేది. కానీ, ఇప్పుడు అలా కాదు. ఊరిలోనే అందుబాటులో ఎనర్జీ అసిస్టెంట్‌ ఉంటున్నారు. ఫిర్యాదు రాగానే వాలిపోతున్నారు. 2019లో విద్యుత్‌ అంతరాయాలపై 6,98,189 ఫిర్యాదులొస్తే.. 2020లో వీటి సంఖ్య 4,36,837గా నమోదైంది. 2021లో అయితే సగానికిపైగా తగ్గిపోయాయి. కేవలం 2,02,496 అంతరాయాలు మాత్రమే వచ్చాయి. 2019తో పోలిస్తే 2021 నాటికి దాదాపు 4.95 లక్షలు, 2020తో పోల్చితే 2.34 లక్షల ఫిర్యాదులు తగ్గాయి.  

మరిన్ని వార్తలు