విశాఖలో ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌ మోడల్‌ భవనం

11 Feb, 2023 08:51 IST|Sakshi

తొమ్మిది నెలల్లో పూర్తి : ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌

సాక్షి, అమరావతి: ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌(ఈసీబీసీ) మోడల్‌ భవనాన్ని విశాఖలో నిర్మిస్తున్నట్టు ఇంద­న శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌(ఏపీఎస్‌ఈసీఎం), విశాఖ నగరపాలక సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) అధికారులతో శుక్రవారం ఆయన వరŠుచ్యవల్‌ సమావేశం నిర్వహించారు. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) సహకారంతో జి+1 అంతస్తుల ఇంధన సామర్థ్యం ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ను విశాఖలో తొమ్మిది నెలల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు.

తక్కువ విద్యుత్‌ వినియోగం, విద్యుత్‌ బిల్లుల తగ్గుదల, హీటింగ్, వెంటిలేషన్, కూలింగ్‌ లోడ్, పగటి కాంతి వంటివి సమర్థంగా ఉపయోగించడం ఈ భవనం ప్రత్యేకతలుగా చెప్పారు. సాధారణ భవనాలకంటే 30–40 శాతం మెరుగైన భవన నిర్మాణ సాంకేతికతతో ఈసీబీసీ భవనాలుంటాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 701 వాణిజ్య భవనాలను ఈ విధంగా నిర్మించేందుకు ‘ఈసీబీసీ’ ద్వారా అనుమతులిచ్చామని పేర్కొన్నారు. వీటితో పాటు దేశంలో నిర్మించే భవనాలకు వైజాగ్‌లో నిర్మించే భవనం సూపర్‌ మోడల్‌గా నిలుస్తుందని చెప్పారు.

రాష్ట్రంలోని 541 కోర్టు భవనాలు, 100 మోడల్‌ పాఠశాలలు, ఒక ప్రధాన ఆస్పత్రిలో ఇంధన సామర్థ్య చర్యలు అమలు చేసినట్లు స్టేట్‌ డిజిగ్నేటెడ్‌ ఏజెన్సీ ఏపీఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని భవన నిర్మాణ రంగంలో (వాణిజ్య భవనాలు) ఇంధన డిమాండ్‌ దాదాపు 4,800 మిలియన్‌ యూనిట్లుగా ఉందని, ఈసీబీసీని అమలు చేయడం వల్ల విద్యుత్‌ ఆదా అవుతుందన్నారు.  సమావేశంలో ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ కె.సంతోషరావు, డైరెక్టర్లు డి.చంద్రం, బి.రమేష్‌ ప్రసాద్, ఏవీవీ సూర్యప్రతాప్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు