23న విశాఖలో ఇంధన సామర్థ్య పెట్టుబడుల సదస్సు

14 Nov, 2022 05:54 IST|Sakshi

బీఈఈ డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ బాక్రే వెల్లడి

ఒకే వేదిక పైకి ఇంధన రంగ పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు 

సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్యం పెట్టుబడుల సదస్సు (ఇన్వెస్ట్‌మెంట్‌ బజార్‌)ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం) సమన్వయంతో 23న విశాఖలో నిర్వహించనున్నట్టు బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ బాక్రే ప్రకటించారు. రాష్ట్ర ఇంధన శాఖ, ఏపీఎస్‌ఈసీఎం అధికారులతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య సాంకేతికతను అందుబాటులోకి తేవటం, దానిని వినియోగించుకోవడం కోసం పరిశ్రమలకు ఆర్థిక సహకారం అందించడమే లక్ష్యంగా ఆసక్తి గల పరిశ్రమలను, బ్యాంకులను, ఆర్థిక సంస్థలను ఒకే వేదిక పైకి తెచ్చేందుకు సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ బజార్‌ వేదికగా పెట్టుబడులకు అవకాశమున్న ప్రాజెక్టులను గుర్తిస్తామని, సదస్సులో ఎంపికైన పరిశ్రమలకు ప్రాజెక్టులు అమలు చేసేందుకు ఆర్థిక సహకారం అందే ఏర్పాటు చేస్తామని అభయ్‌ బాక్రే చెప్పారు.

గతేడాది మార్చిలో ఇదే విశాఖలో దేశంలో తొలిసారిగా ఇంధన సామర్థ్య పెట్టుబడుల సదస్సును నిర్వహించిన ఘనత ఏపీకి దక్కుతుందని, విద్యుత్‌ రంగంలో ప్రత్యేకించి ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో ఏపీ పనితీరును గుర్తించి మరోసారి విశాఖలో సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పరిశ్రమల నుంచి ఏపీఎస్‌ఈసీఎంకు ప్రతిపాదనలు వస్తే వాటికి అవసరమైన సాంకేతిక ప్రక్రియ నిర్వహించి, ఆర్థిక సంస్థలకు పంపుతామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ తెలిపారు. సమావేశంలో ఏపీఎస్‌ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి, ఇంధన శాఖ అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు