ఎంఎస్‌ఎంఈల్లో ఇంధన పొదుపు 

8 Sep, 2021 04:45 IST|Sakshi

ఇప్పటికే 3 జిల్లాల్లో అధ్యయనం 

20 నుంచి 25 శాతం వరకు విద్యుత్‌ ఆదా 

చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఇంధన సామర్థ్య సాంకేతికత 

ఆర్థిక సహకారం కోరుతూ కేంద్రానికి సీఎస్‌ లేఖ 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల్లో ఇంధన పొదుపుపై ప్రభుత్వం దృష్టిసారించింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లోని ఎంపిక చేసిన క్టస్టర్లలో ఇంధన సామర్థ్య సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ కేంద్ర విద్యుత్‌శాఖకు లేఖ రాశారు. ఆర్థిక వృద్ధి సాధించే క్రమంలో పర్యావరణంపై తక్కువ ప్రభావం ఉండాలనే ఇంటెండెడ్‌ నేషనల్లీ డిటర్మైండ్‌ కంట్రిబ్యూషన్స్‌ (ఐఎన్డీసీ) లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో పెద్ద ఎత్తున ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సాంకేతికతను వినియోగించటం ద్వారా పరిశ్రమల్లో ఇంధన వనరులను సమర్థంగా వినియోగించుకోగలమని తెలిపారు. తద్వారా ఇంధనాన్ని పొదుపు చేస్తూ, కాలుష్యాన్ని నియంత్రించటంతోపాటు అధిక  ఉత్పాదకతను సాధించగలుగుతామని వివరించారు.  

తొలిదశలో మత్స్య, రిఫాక్టరీ, ఫౌండ్రీ క్లస్టర్లలో.. 
బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సహకారంతో రాష్ట్రంలోని కొన్ని భారీ పరిశ్రమల్లో రాష్ట్ర ప్రభుత్వం పాట్‌ (పెర్ఫార్మ్, అచీవ్‌ అండ్‌ ట్రేడ్‌)ను విజయవంతంగా అమలు చేస్తోంది. దీనిద్వారా ఇప్పటివరకు 3,430 మిలియన్‌ యూనిట్లకు సమానమైన 0.295 ఎంటీవోఈ (మిలియన్‌ టన్‌ ఆఫ్‌ ఆయిల్‌ ఈక్వాలెంట్‌)ని ఆదాచేసింది. దీని విలువ సుమారు రూ.2,350 కోట్లు. ఇంధన పొదుపునకు ఎంఎస్‌ఎంఈ రంగంపై దృష్టి సారించిన ప్రభుత్వం రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం)తో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోని 3 ఎంఎస్‌ఎంఈ యూనిట్లలో (మత్స్య, ఫౌండ్రీ, రిఫాక్టరీల్లో)  అధ్యయనం నిర్వహించింది. ఎంఎస్‌ఎంఈ సెక్టారులో ఇంధనాన్ని పొదుపు చేసేందుకు, నూతన సాంకేతికత  మెరుగుదలకు పెద్ద ఎత్తున  అవకాశం  ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. దీంతో తొలిదశలో రాష్ట్ర వ్యాప్తంగా  ఉన్న మత్స్య, రిఫాక్టరీ, ఫౌండ్రీ క్లస్టర్లలో  ఇంధన సామర్థ్య కార్యక్రమాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి  అవసరమైన  ఆర్థిక సహకారాన్ని  బీఈఈ ద్వారా అందించాలని కేంద్రాన్ని కోరింది. 

రూ.2,014 కోట్ల విద్యుత్‌ ఆదా 
రాష్ట్రంలో ఏడాదికి సరాసరి 67,500 మిలియన్‌  యూనిట్ల విద్యుత్‌ డిమాండు ఉండగా.. ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇంధన పరిరక్షణ చర్యల ద్వారా 20 నుంచి 25 శాతం వరకు విద్యుత్‌ను పొదుపు చేసే అవకాశం ఉంది. ఎల్‌ఈడీ వీధిలైట్లు, వ్యవసాయ, పరిశ్రమల రంగాల్లో అమలు చేసిన ఇంధన సామర్థ్య కార్యక్రమాలు తదితరాల వల్ల ప్రాథమిక అంచనా ప్రకారం 2,932 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా అయింది. దీనివిలువ రూ.2,014 కోట్ల వరకు ఉంటుంది. మరిన్ని ఇంధన సామర్థ్య చర్యలు  చేపట్టడం వల్ల మరో 14 వేల మిలియన్‌ యూనిట్లను ఆదా చేసేందుకు అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం విద్యుత్‌  డిమాండ్‌లో 35 శాతం పారిశ్రామిక రంగంలోనే  వినియోగం అవుతోంది. 
– ఎన్‌.శ్రీకాంత్, ఇంధనశాఖ  కార్యదర్శి  

మరిన్ని వార్తలు