చార్జీల పెంపు స్వల్పమే

1 Apr, 2022 03:09 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్‌. చిత్రంలో ఉన్నతాధికారులు

100 యూనిట్ల లోపు చార్జీలు ఏపీలోనే అతి తక్కువ

కొత్త టారిఫ్‌తో డిస్కమ్‌లకు వచ్చేది రూ.1,400 కోట్లు మాత్రమే: ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్‌

‘కామన్‌ టెలిస్కోపిక్‌’తో సామాన్యులకు ఊరట

విద్యుత్‌ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.35 వేల కోట్లిచ్చి ఆదుకుంది.. ప్రజలపై భారం పడకుండా రూ.11,123 కోట్ల సబ్సిడీని భరిస్తోంది

ఈ ఆర్థిక సంవత్సరంలో ట్రూ అప్‌ వసూలు రూ.700 కోట్లు 

గత సర్కారు ట్రూ అప్‌ ఫైల్‌ చేయకపోవడంతో భారం 

అధిక ధరలకు దీర్ఘకాలిక పీపీఏలతో విద్యుత్‌ సంస్థలకు నష్టం: దువ్వూరి కృష్ణ

రూ.68 వేల కోట్లకుపైగా అప్పులు, రూ.21 వేల కోట్లకుపైగా బకాయిలు గత సర్కారు నిర్వాకమే

దివాలా దశకు చేరుకున్న డిస్కమ్‌లను ఆదుకుని విద్యుత్‌ సంస్కరణలు చేపట్టాం

సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాలతో పోల్చితే వంద యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగదారులకు కరెంట్‌ చార్జీలు ఆంధ్రప్రదేశ్‌లోనే అతి తక్కువని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్‌ వెల్లడించారు. కామన్‌ టెలిస్కోపిక్‌ విధానం ప్రకారం సామాన్యులపై భారం లేకుండా విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) కొత్త టారిఫ్‌ ప్రకటించిందని చెప్పారు. విద్యుత్‌ చార్జీలను భారీగా పెంచినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. కొత్త టారిఫ్‌ ప్రకారం చార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. గురువారం విజయవాడలోని ఆర్‌ అండ్‌ బీ కార్యాలయంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్, ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ జె.పద్మజనార్ధనరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలివీ..

► విద్యుత్‌ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.35 వేల కోట్లు ఇచ్చి ఆదుకుంది. ఇకపైనా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వంద యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగదారులకు చార్జీలు ఏపీలోనే తక్కువ. 75 యూనిట్ల వరకు వినియోగానికి టారిఫ్‌ ఇప్పటికీ సగటు సరఫరా వ్యయంలో 50 శాతం కంటే తక్కువగా ఉంది. దీని పరిధిలోకి వచ్చే వారు మొత్తం గృహ వినియోగదారుల్లో 50 శాతం వరకు ఉంటారు. 
► టెలిస్కోపిక్‌ విధానంలో 0–30 యూనిట్లకు విద్యుత్‌ చార్జీల పెంపు చాలా స్వల్పం. ప్రజల వినతి మేరకే ఏపీఈఆర్‌సీ ఈ శ్లాబ్‌లను తెచ్చింది. 
► తెలంగాణలో తాజాగా రూ.5,600 కోట్ల మేర విద్యుత్‌ చార్జీలను పెంచగా ఆంధ్రప్రదేశ్‌లో పెంపుదల రూ.1,400 కోట్లు మాత్రమే ఉంది. 
► ట్రూ అప్‌ చార్జీలను మూడో త్రైమాసికంలో ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో రూ.3,368 కోట్లు, ఏపీఈపీడీసీఎల్‌లో రూ.609 కోట్లుగా మండలి నిర్ణయించింది. రూ.3,977 కోట్ల సర్దుబాటు మొత్తంలో వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారుల రాయితీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,066.54 కోట్ల భారాన్ని భరిస్తుండగా మిగతాది మాత్రమే ఇతర వినియోగదారుల నుంచి పంపిణీ సంస్థలు వసూలు చేయాలని మండలి ఆదేశించింది. అది కూడా వినియోగదారుల వాస్తవ వినియోగం ఆధారంగా యూనిట్‌కు ఏపీఎస్పీడీసీఎల్‌ రూ.0.23, ఏపీసీపీడీసీఎల్‌ రూ.0.22, ఏపీఈపీడీసీఎల్‌ రూ.0.07 చొప్పున మాత్రమే విధించాలని నిర్దేశించింది. ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్‌లో ఆగస్టు 1వ తేదీ నుంచి 36 నెలలు, ఏపీఈపీడీసీఎల్‌ 18 నెలల వాయిదాలలో వసూలు చేయాలని ఆదేశించింది. దీని ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ట్రూఅప్‌ వసూలు రూ.700 కోట్లు మాత్రమే. గత సర్కారు ట్రూ అప్‌ ఫైల్‌ చేయకపోవడం పెనుభారంగా పరిణమించింది.
► 2022–23లో మొత్తం ఆదాయ అవసరం రూ.45,398.66 కోట్లుగా డిస్కమ్‌లు అంచనా వేశాయి. ఇందులో రూ.11,123.21 కోట్లను ఉచిత విద్యుత్, సబ్సిడీల కింద రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుండటంతో 20.76 లక్షల మంది వినియోగదారులపై చార్జీల పెంపు ప్రభావం ఏమాత్రం ఉండదు. మూడు పంపిణీ సంస్థల సగటు విద్యుత్‌ కొనుగోలు ఖర్చు యూనిట్‌కు రూ.6.82 నుంచి రూ.6.98కు పెరిగింది. 
► రాష్ట్రంలో 74 శాతం విద్యుత్‌ థర్మల్‌ ద్వారా ఉత్పత్తి అవుతుండగా ప్రస్తుతం 230 మిలియన్‌ యూనిట్ల వినియోగం జరుగుతోంది. మనకు బొగ్గు గనులు లేకపోవడంతో మహానది (ఒడిశా), సింగరేణి కాలరీస్‌(తెలంగాణ)పై ఆధారపడి  కొనుగోలు చేస్తున్నాం. బొగ్గు రేట్లు, రవాణా చార్జీల పెరుగుదల కారణంగా ఏటా 14 శాతం ఉత్పత్తి వ్యయం అధికం అవుతోంది. నిజానికి దీని కారణంగానే విద్యుత్‌ చార్జీలు పెంచాల్సి వచ్చింది.

గుదిబండల్లా పీపీఏలు
గత సర్కారు హయాంలో కుదుర్చుకున్న దీర్ఘకాలిక పీపీఏల వల్ల విద్యుత్‌ సంస్థలపై అదనపు భారం పడుతోందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ పేర్కొన్నారు. గత ప్రభుత్వం సగటు విద్యుత్‌ కొనుగోలు రేటు కంటే అధిక ధరలకు 25 ఏళ్లకు పీపీఏలు కుదుర్చుకుందని పీపీఏల రద్దు వల్ల చార్జీలు పెరిగాయనే వాదనలో వాస్తవం లేదన్నారు. ఆ పీపీఏలను రద్దు చేయలేదని, ధరలను సమీక్షించాలని ప్రభుత్వం ఆయా కంపెనీలకు సూచించిందన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి విద్యుత్‌ రంగంలో రూ.68 వేల కోట్లకుపైగా అప్పులు, రూ.21 వేల కోట్లకుపైగా బిల్లుల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.

2014 నాటికి విద్యుత్తు సంస్థలు రూ.29,703 కోట్ల మేర అప్పుల్లో ఉండగా టీడీపీ హయాంలో 2019 నాటికి రూ.68,596 కోట్లకు పెరగడంతో నష్టాలతో దివాలా తీసే పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం విద్యుత్‌ రంగ సంస్కరణలతోపాటు పొదుపు చర్యలను సమర్థంగా అమలు చేయడం, ఆర్థికంగా చేయూత ద్వారా డిస్కమ్‌లను ఆదుకున్నట్లు చెప్పారు. గత సర్కారు ట్రూ అప్‌ చార్జీలను ఫైల్‌ చేయకుండా వ్యవస్థలను అడ్డదిడ్డంగా మేనేజ్‌ చేయడం వల్లే అప్పులు ఆ స్థాయికి పెరిగాయని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్వాకాల కారణంగా విద్యుత్తు రంగం కుప్పకూలే పరిస్థితి నెలకొనడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రైతులకు అందించే వ్యవసాయ ఉచిత విద్యుత్‌ కోసం సెకీ నుంచి తక్కువ ధరకే కరెంట్‌ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు