ఎంసెట్‌ ‘ఇంజనీరింగ్‌’కు 84.38% మంది హాజరు 

24 Sep, 2020 05:07 IST|Sakshi

ఈనెల 25 వరకు అగ్రి, మెడికల్‌ ప్రవేశ పరీక్ష.. 

26న ప్రిలిమనరీ ‘కీ’  

సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్‌–2020కి సంబంధించి ఇంజనీరింగ్‌ విభాగంలో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 17 నుంచి ప్రారంభమైన ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,85,946 మంది దరఖాస్తు చేసుకోగా 1,56,899 మంది(84.38 శాతం) మంది హాజరయ్యారని ఉన్నత విద్యామండలి ప్రత్యేకాధికారి(ఏపీ సెట్స్‌) డాక్టర్‌ ఎం.సుధీర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఏపీలోని 47 పట్టణాల్లోని 118 పరీక్ష కేంద్రాల్లో రోజుకు రెండు చొప్పున మొత్తం 14 సెషన్లలో కంప్యూటరాధారితంగా ఈ పరీక్ష నిర్వహించారు.

కోవిడ్‌ నేపథ్యంలో ఈసారి పరీక్ష కేంద్రాల పెంపుతో పాటు సెషన్ల సంఖ్యనూ పెంచారు. ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షలు ముగియడంతో.. అగ్రి, ఫార్మా, మెడికల్‌ విభాగం పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ విభాగంలో 87,637 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 25తో ఈ పరీక్షలు పూర్తవుతాయి. అగ్రి, మెడికల్‌ విభాగం తొలిరోజు పరీక్షకు 86.89 శాతం మంది హాజరయ్యారు. కాగా, ఎంసెట్‌–2020 ప్రాథమిక ‘కీ’ని ఈనెల 26న విడుదల చేయనున్నారు. ‘కీ’పై అభ్యంతరాలను ఈనెల 28 వరకు స్వీకరిస్తారు.  

మరిన్ని వార్తలు