కడలి కోత పెడుతోంది!

16 Aug, 2022 04:29 IST|Sakshi
విశాఖ ఆర్కే బీచ్‌లో కొబ్బరి చెట్ల వరకు కోతకు గురైన తీరం

ముందుకు చొచ్చుకు వస్తున్న సముద్రం

కోతకు గురవుతున్న విశాఖ తీరం

35 కిలోమీటర్ల మేర ప్రభావం 

ఉత్తర గాలుల ఉధృతి.. అల్పపీడనమే కారణం

సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సాగర తీరం మళ్లీ కోతకు గురవుతోంది. తరచూ సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. గతంలో తుపానులు, పెను తుపానుల సమయంలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తేది. కానీ ఇప్పుడు స్వల్పంగా ప్రభావం చూపే అల్పపీడనాలు, ఆవర్తనాలు వంటివి ఏర్పడినప్పుడు కూడా కడలి కన్నెర్ర చేస్తోంది. గతంలో 2014, 2015, 2016 సంవత్సరాల్లో విశాఖ సాగర తీరం కోతకు గురైంది. 2015లో మరింత అధికంగా.. కిలోమీటర్ల మేర తీరం దెబ్బతింది. ఆర్కే బీచ్‌ సహా పలుచోట్ల బీచ్‌లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. అప్పట్లో జీవీఎంసీ అధికారులు తీరంలో పెద్దపెద్ద బండ రాళ్లను దింపి కోతను తాత్కాలికంగా కట్టడి చేశారు.

యారాడ నుంచి భీమిలి వరకూ..
సముద్రం నుంచి అలలు ఎగసిపడుతూ దూకుడుగా ముందుకు రావడం వల్ల తీరంలో ఇసుక పెద్దమొత్తంలో సముద్రంలోకి కొట్టుకుపోతోంది. సాధారణంగా ఏటా నైరుతి రుతుపవనాల సీజనులో అలల ఉధృతి అధికంగా ఉండటం వల్ల తీరం కోతకు గురవుతోంది. కొన్నిసార్లు ఈశాన్య రుతుపవనాల సీజన్‌లోనూ ఇక్కడి తీరం కోత సమస్య ఎదుర్కొంటోంది. ముఖ్యంగా యారాడ నుంచి భీమిలి వరకు దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో కొన్నిచోట్ల సముద్ర తీరం తరచూ కోతకు గురవుతున్నట్టు నిపుణులు ఇప్పటికే గుర్తించారు.

ఇందులో యారాడ బీచ్, కోస్టల్‌ బ్యాటరీ, ఆర్కే బీచ్, కురుసుర సబ్‌మెరైన్‌ మ్యూజియం, చిల్డ్రన్‌ పార్క్, జోడుగుళ్లపాలెం, రుషికొండ, భీమిలి తదితర ప్రాంతాలున్నాయి. ఈ పరిస్థితిని నివారించడానికి విశాఖ పోర్టు అథారిటీ (వీపీఏ) డ్రెడ్జర్లతో డ్రెడ్జింగ్‌ చేయిస్తుంటుంది. ఏటా ఏప్రిల్, మే నెలల్లో డ్రెడ్జింగ్‌ ద్వారా కోతకు గురైన ప్రాంతాల్లో ఇసుకను పంపింగ్‌ చేస్తుంది. దీంతో తీరం కోతకు ఒకింత అడ్డుకట్ట పడుతోంది. 

తాజాగా దూకుడు
తాజాగా విశాఖ తీరం మరోసారి కోతకు గురవుతోంది. దాదాపు వారం రోజులుగా ఈ పరిస్థితి ఉంది. కోస్టల్‌ బ్యాటరీ నుంచి పార్క్‌ హోటల్‌ వరకు ఉన్న మధ్య ప్రాంతంతోపాటు మరికొన్ని చోట్ల కోత ప్రభావం కనిపిస్తోంది. విశాఖ బీచ్‌లో నాలుగైదు చోట్ల పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచడానికి ఓ రిసార్ట్స్‌ సంస్థ కొన్నేళ్ల క్రితం సుమారు 600 కొబ్బరి చెట్లను నాటింది. ఈ చెట్లు బీచ్‌ అందాలను ఆస్వాదించడానికి వచ్చే పర్యాటక ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సముద్ర తీరం కోతకు గురవుతుండడంతో వీటిలో కొన్ని కొబ్బరి చెట్లు, బీచ్‌లో వివిధ ఆకృతులతో జీవీఎంసీ ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్తంభాలు కూలుతున్నాయి. 

అలల ఉధృతి ఎక్కువైంది
ఈ నెల 7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 11వ తేదీన పౌర్ణమి వచ్చింది. మరోవైపు ఉత్తరం వైపు నుంచి గాలుల ఉధృతి కూడా పెరిగింది. వీటి ప్రభావంతో అలల ఉధృతి సాధారణం కంటే అధికమైంది. సముద్ర కెరటాలు ముందుకు చొచ్చుకు వచ్చాయి. ఈ పరిస్థితులన్నీ తాజాగా విశాఖ తీరం కోతకు కారణమవుతున్నాయి.    
– ప్రొఫెసర్‌ కేవీఎస్‌ఆర్‌ ప్రసాద్, వాతావరణం–సముద్ర అధ్యయన విభాగ పూర్వ అధిపతి, ఏయూ

మరిన్ని వార్తలు