14 నుంచి ఈసెట్‌ కౌన్సెలింగ్‌ 

8 Jul, 2023 04:45 IST|Sakshi

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల  

17 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ – 20 వరకు సర్టిఫికెట్ల పరిశీలన 

19–21 వరకు ఆప్షన్ల ఎంపిక

25న సీట్ల కేటాయింపు 

ఆగస్టు 1 నుంచి తరగతులు  

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈసెట్‌–2023 కౌన్సెలింగ్‌ను ఈ నెల 14 నుంచి ప్రారంభిస్తున్నట్టు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సాంకేతిక విద్యా శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆమె కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈసెట్‌లో అర్హత సాధించినవారు ఈ నెల 14 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలని సూచించారు.

అనంతరం 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 19 నుంచి 21 వరకు ఆప్షన్ల ఎంపిక ఉంటుందన్నారు. 22న అభ్యర్థులు ఆప్షన్లను మార్చుకోవచ్చని తెలిపారు. 25న సీట్లు కేటాయిస్తామన్నారు. సీట్లు పొందినవారు 25 నుంచి 30లోగా ఆయా కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాలని సూచించారు. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు రాష్ట్రవ్యాప్తంగా 14 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అభ్యర్థులు ఈసెట్‌ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, పదో తరగతి మార్కుల సర్టిఫికెట్, పాలిటెక్నిక్‌ డిప్లొమా మార్కుల జాబితా, ప్రొవిజినల్‌ సర్టిఫికెట్, ఏడో తరగతి నుండి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, 2020 జనవరి 1 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, రిజర్వుడ్‌ అభ్యర్థులు.. అందుకు తగిన పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ సిద్ధం చేసుకోవాలన్నారు.

కాగా ఈ ఏడాది 38,181 మంది ఈసెట్‌కు దరఖాస్తు చేసుకోగా 34,503 మంది పరీక్ష రాశారన్నారు. ఇందులో 31,933 (92.55 శాతం) మంది అర్హత సాధించారని తెలిపారు. మరిన్ని వివరాలకు 7995681678, 7995865456, 9177927677 నంబర్లకు ఫోన్‌ చేయొచ్చన్నారు. 

మరిన్ని వార్తలు