అచ్యుతాపురం సెజ్‌లో ఈఎస్‌ఐ హాస్పిటల్‌ 

6 Jul, 2021 04:38 IST|Sakshi

2 ఎకరాల్లో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం 

సాక్షి, అమరావతి: వేగంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురం సెజ్‌లో ఉద్యోగులకు త్వరలో ఈఎస్‌ఐ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న డిస్పెన్సరీ స్థానంలో 30 పడకల హాస్పిటల్‌ నిర్మించాలని ఈఎస్‌ఐ నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 50 లక్షల మందికి పైగా ఈఎస్‌ఐ పథకం ప్రయోజనాలు పొందుతుండగా అందులో ఒక్క అచ్యుతాపురం సెజ్‌ పరిధిలోనే 60,000 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు.

వీరికి ఇన్‌పేషెంట్‌ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా 30 పడకల హాస్పిటల్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి అవసరమైన రెండు ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వడానికి ఏపీఐఐసీ బోర్డు ఈ మధ్యనే ఆమోదం తెలిపింది. దీంతో అచ్యుతాపురంలోని ఏపీ సెజ్‌ ప్లాట్‌ నెంబర్‌ 45లోగల రెండు ఎకరాల భూమిని ఈఎస్‌ఐ కార్పొరేషన్‌కు ఉచితంగా ఇస్తూ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీఐఐసీని ఉత్తర్వుల్లో ఆదేశించారు. 

మరిన్ని వార్తలు