కరోనా పరీక్షలు.. పండుగ తర్వాత పరుగులు

9 Jan, 2022 03:13 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా 19 కొత్త వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ల ఏర్పాటు

సంక్రాంతి అనంతరం కార్యకలాపాలు ప్రారంభం

తుదిదశకు మైక్రోబయాలజిస్టులు, ఇతర సిబ్బంది నియామకం 

ఒమిక్రాన్‌ నిర్ధారణకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ ఇటీవలే ప్రారంభం

సాక్షి, అమరావతి: కరోనా మూడో దశ పొంచి ఉన్న నేపథ్యంలో ఎక్కువ పరీక్షలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 19 వైరస్‌ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నస్టిక్‌ ల్యాబొరేటరీ (వీఆర్‌డీఎల్‌)లు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో మాత్రమే ఇవి ఉండటంవల్ల జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి నమూనాలు తరలించి, పరీక్షలు చేసి ఫలితాలు వెలువరించడానికి కొంత సమయం పడుతోంది. అన్ని జిల్లా ఆసుపత్రులు, కొన్ని ప్రాంతీయ ఆసుపత్రుల్లో ప్రయోగశాలలను ప్రభుత్వం నెలకొల్పింది. వీటిల్లో పనిచేయడానికి మైక్రోబయాలజిస్ట్‌లు, ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. సంక్రాంతి పండుగ తర్వాత వీటి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం తొలినుంచీ అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కువ పరీక్షలు చేసి తద్వారా పాజిటివ్‌ రోగులను గుర్తించి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నది సర్కారు భావన.

జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో..
ప్రస్తుతం ఈ వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌లు రాష్ట్రంలోని 14 ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఉన్నాయి. వీటికి అదనంగా జిల్లా, ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాల్లో 19 చోట్ల కొత్త ల్యాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ ప్రయోగశాలల్లో క్షయ, హెచ్‌ఐవీ, డెంగీ, ఇతర వైరస్‌ పరీక్షలూ చేసేందుకు వీలుంటుంది. ప్రారంభంలో ఒక్కో సెంటర్‌ రోజుకు వెయ్యి నిర్ధారణ పరీక్షలు చేసే సామర్థ్యం ఉంటుంది. ముందు ముందు నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. 

తొలి నుంచి దూకుడుగా..
కరోనా కట్టడి చర్యల్లో సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ తొలి నుంచి దూకుడుగానే ముందుకెళ్తోంది. రాష్ట్రంలో తొలి కరోనా కేసు 2020 మార్చి 10న నెల్లూరు జిల్లాల్లో వెలుగుచూసింది. ప్రారంభంలో వైరస్‌ నిర్ధారణకు రాష్ట్రంలో ఒక్క ల్యాబ్‌ కూడాలేదు. పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు అప్పట్లో నమూనాలు పంపేవారు. తదనంతరం యుద్ధప్రాతిపదికన అదే ఏడాది అక్టోబర్‌ నాటికి రోజుకు 80వేల ఆర్‌టీపీసీఆర్, ర్యాపిడ్, యాంటిజెన్‌లతో కలిపి రోజుకు ఒక లక్ష నుంచి 1.20 లక్షల పరీక్షల సామర్థ్యం కలిగిన 150 ల్యాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. తాజాగా.. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ పరీక్షలు చేపట్టడానికి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ను ఇటీవల ప్రారంభించింది. ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించిన నమూనాలను ప్రస్తుతం విజయవాడ జీనోమ్‌ ల్యాబ్‌లో పరీక్షిస్తున్నారు.

పండుగ తర్వాత అందుబాటులోకి
సంక్రాంతి పండుగ అనంతరం ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయి. సిబ్బంది నియామకానికి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. సిబ్బంది నియామకం, ఇతర కార్యకలాపాల పురోగతిపై రోజు సమీక్షిస్తున్నాం.     
– డాక్టర్‌ వినోద్‌కుమార్, ఏపీ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌

రూ.6.22 కోట్లు ఖర్చు
రాష్ట్రంలో 19 ల్యాబ్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6.22 కోట్లు వెచ్చించింది. సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చుల రూపంలో నెలకు రూ.1.10 కోట్లు ఖర్చుచేయనుంది. 
    – వినయ్‌చంద్, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సీఈఓ 

మరిన్ని వార్తలు