వారియర్స్‌కు అండగా..

1 May, 2021 05:07 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రాణాలను సైతం లెక్కచేయక కోవిడ్‌ కట్టడిలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు తక్షణ సాయం అందించేలా ప్రతి జిల్లాలో కోఆర్డినేషన్‌ సెల్‌లు ఏర్పాటు చేస్తున్నారు. సెకండ్‌ వేవ్‌లోనూ కోవిడ్‌ బారిన పడుతున్న పోలీసుల సంఖ్య పెరుగుతుండటంతో వారి కోసం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తక్షణ చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కోఆర్డినేషన్‌ సెల్‌లు ఏర్పాటు చేశారు.

వీటి ద్వారా వైరస్‌ బారిన పడిన సిబ్బంది పరిస్థితి, ఆస్పత్రి బెడ్, వైద్య సేవలు, తదితర అన్ని విషయాలను జిల్లా కేంద్రాల నుంచి ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు. కోవిడ్‌ సోకిన పోలీసులతో మాట్లాడుతూ వారికి ధైర్యం చెబుతున్నారు. జిల్లాల నుంచి ఈ సమాచారాన్ని డీజీపీ కార్యాలయానికి చేరవేస్తున్నారు. మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలోని హెల్ప్‌ డెస్క్‌ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. 

రెండో దశలో 2,150కి పైగా పోలీసులకు కోవిడ్‌
రాష్ట్రంలో తొలి దశలో దాదాపు 15 వేల మందికిపైగా పోలీసులు కోవిడ్‌ బారిన పడగా ఇందులో 109 మంది మరణించారు. తాజాగా రెండో దశలో 2,150 మందికిపైగా పోలీసులకు కోవిడ్‌ సోకింది. ఇందులో ఇప్పటివరకు సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ వింగ్‌ (ఎస్‌ఐడబ్ల్యూ) ఎస్పీ రాంప్రసాద్‌తో సహా 14 మంది మృతి చెందారు. దీంతో అప్రమత్తమైన పోలీసు శాఖ నష్టనివారణ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 18 పోలీస్‌ యూనిట్ల పరిధిలో ఇప్పటికే 94 శాతం తొలి దశ టీకా కార్యక్రమాన్ని పూర్తి చేసింది. త్వరలోనే రెండో విడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టనుంది.

దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న, 55 ఏళ్లు పైబడిన ఆరు వేల మందికిపైగా పోలీసులకు కోవిడ్‌ విధుల నుంచి మినహాయింపు ఇచ్చింది. వీరిని స్టేషన్‌ డ్యూటీలు, రోజువారీ విధులకు వాడుకుంటోంది. కాగా, కోవిడ్‌ డ్యూటీలను ఎస్పీ కార్యాలయాల నుంచి పర్యవేక్షిస్తున్నారు. కోవిడ్‌ విధుల్లో భాగంగా మాస్క్, శానిటైజేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించడం, రాత్రిపూట కర్ఫ్యూ నిర్వహించడంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ పోలీసుకు కోవిడ్‌ లక్షణాలు కనిపించినా తక్షణం జిల్లా ఎస్పీ, నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయాలకు సమాచారం అందిస్తున్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు