సాగుదార్లకు యాంత్రీకరణ అండ

3 Aug, 2020 04:35 IST|Sakshi

కరోనా, కూలీల కొరత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

10,641 రైతు భరోసా కేంద్రాల పరిధిలో కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాల ఏర్పాటు

సాక్షి, అమరావతి: ఓ వైపు కరోనా వైరస్‌.. మరోవైపు వ్యవసాయ కూలీల కొరత నేపథ్యంలో రైతులకు అండగా నిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాల పరిధిలో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను అందించనుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 

► గతంలో ఈ తరహా పథకం కింద కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా దీని ప్రయోజనాలు కొద్దిమందికే పరిమితం కావడంతో దీన్ని సమూలంగా మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావించారు. 
► వాస్తవ సాగుదార్లకు మేలు జరగాలంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ యంత్ర పరికరాలను అద్దెకు ఇవ్వడం లేదా ఆసక్తి ఉన్నవారు కొనుగోలు చేసే వెసులుబాటు ఉండేలా కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 
► గ్రామ సచివాలయం పరిధిలో అక్కడ పండిస్తున్న పంటలకు అవసరమైన యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచితే ఎక్కువ మంది రైతాంగం వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఆర్బీకే పరిధిలో యంత్ర పరికరాలను ఉంచి రైతులకు సరసమైన అద్దెలకు ఇవ్వడానికి వ్యవసాయ శాఖ ప్రణాళికలను తయారు చేస్తోంది. 
► రైతు సంఘాలకు లేదా స్థానిక యువతతో ఏర్పాటు చేసే గ్రూపులకు ఈ పరికరాల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తారు. 

ఈ పథకం ముఖ్యాంశాలు ఇలా..
► ప్రతి గ్రామంలోనూ అందుబాటులో వ్యవసాయ యంత్ర పరికరాలు. ఆయా గ్రామాల్లోని వాస్తవ సాగుదార్లతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి నిజమైన లబ్ధిదారులకు మేలు జరిగేలా చూడడం?
► రైతులకు అందుబాటు ధరల్లో యంత్ర పరికరాల లభ్యత
► 40 శాతం రాయితీతోపాటు గ్రూపులకు 50 శాతం రుణ సౌకర్యం
► బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించి మంచి పేరున్న రైతులనే గ్రూపుల్లో సభ్యులుగా చేర్చుకుంటారు. ఆయా సంఘాలు రుణ వాయిదాలను సక్రమంగా చెల్లించేలా వ్యవసాయ శాఖ తన వంతు బాధ్యత నిర్వహిస్తుంది.
► యంత్ర పరికరాల ధరల నిర్ణయంలో పూర్తి పారదర్శకత ఉండేలా ఆయా కంపెనీలతో వ్యవసాయ శాఖ సంప్రదింపులు జరుపుతుంది. ఆ ధరలను ఆన్‌లైన్‌తోపాటు రైతు భరోసా కేంద్రాల్లోని కియోస్క్‌లలో కూడా ఉంచుతారు.
► పరికరాల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఈ నెలాఖరున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ యాంత్రీకరణ ఎగ్జిబిషన్లు
► రైతు భరోసా కేంద్రం పరిధిలో ప్రస్తుతమున్న యంత్ర పరికరాల వివరాలతోపాటు అదనంగా కావాల్సిన పరికరాల గురించి రైతులతో చర్చించి సమగ్ర సమాచారాన్ని ఈ వారం చివరిలోగా పంపాలని వ్యవసాయ శాఖ.. గ్రామీణ వ్యవసాయ సహాయకులను ఆదేశించింది.
► ముఖ్యమంత్రి అధ్యక్షతన త్వరలో జరిగే సమావేశంలో ఈ పథకం విధివిధానాలు ఖరారు చేస్తారు.
► మండల స్థాయిలో యంత్ర పరికరాల వినియోగం, నిర్వహణ, మరమ్మతులకు సంబంధించి ఆయా కంపెనీల సహకారంతో యువతీ యువకులకు శిక్షణ ఇస్తారు.
► శ్రీకాకుళం జిల్లా నైరా, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట, కర్నూలు జిల్లా తంగెడంచలో వ్యవసాయ యాంత్రీకరణ శిక్షణ కేంద్రాలు ఏర్పాటవుతాయి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా