నర్సరీలకు మహర్దశ

28 Nov, 2022 04:27 IST|Sakshi

దేశంలోనే తొలి నర్సరీ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ ఏర్పాటు

కంపెనీ పరిధిలో 300కు పైగా నర్సరీలు భాగస్వామ్యం

విదేశీ వెరైటీలు దేశీయంగా ఉత్పత్తి, మార్కెటింగ్‌ 

మూడేళ్లలో రూ.100 కోట్ల వ్యాపార లక్ష్యం

నర్సరీలకు మహర్దశ పట్టనుంది. ప్రభుత్వ తోడ్పాటుతో దేశంలోనే తొలి నర్సరీ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ (ఎఫ్‌పీసీ) ఏర్పాటుకు రాష్ట్రంలో బీజం పడింది. ఇప్పటికే ఈ రంగాన్ని వ్యవస్థీకృతం చేసేందుకు ఏపీ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ హార్టీకల్చర్‌ నర్సరీస్‌ యాక్ట్‌– 2010ని సవరించి దేశంలోనే తొలిసారి రాష్ట్రంలోని నర్సరీలన్నిటినీ చట్టపరిధిలోకి తెచ్చారు. వాటికి లైసెన్సులు జారీ చేస్తున్నారు. మరోవైపు ఈ రంగాన్ని బలోపేతం  చేసేందుకు అవసరమైన ఆర్థిక చేయూతనిస్తూ ఎఫ్‌పీవోలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
– సాక్షి, అమరావతి

అత్యుత్తమ శ్రేణి.. తక్కువ ధర నినాదంతో
రాష్ట్రంలో 3,550 నర్సరీల్లో ఏటా 422 కోట్ల మొక్కలను ఉత్పత్తి చేస్తుండగా.. ఏటా రూ.2,482 కోట్ల టర్నోవర్‌ జరుగుతోంది. ప్రత్యక్షంగా 4.50 లక్షల మంది, పరోక్షంగా లక్షమంది ఉపాధి పొందుతున్నారు. సొంతంగా మొక్కల్ని ఉత్పత్తి చేసే నర్సరీలు, స్థానికంగా ఉత్పత్తి చేసే మొక్కల రకాలు చాలా తక్కువనే చెప్పాలి.

దశాబ్దాలుగా వేళ్లూనుకున్న ఈ రంగం నేటికీ పూణే, కేరళ, బెంగాల్‌తో పాటు విదేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి స్థానిక నర్సరీలు తీసుకొచ్చే మొలకలు, విత్తనాలపై ఆధారపడే పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పైగా రవాణ, నిర్వహణ చార్జీల పేరిట ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో అమ్ముతున్నారు. నాణ్యమైన మొక్కలు అందని ద్రాక్షగా మారింది.

నాసిరకం మొక్కల బారినపడి ఏటా వందలాది కోట్ల పెట్టుబడిని రైతులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో అత్యుత్తమ శ్రేణి.. తక్కువ ధర (హై క్వాలిటీ.. లో ప్రైస్‌) నినాదంతో నాణ్యమైన దేశీ, విదేశీ మొక్కలను స్థానికంగా ఉత్పత్తి చేసి, తక్కువ ధరకు అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలోనీ నర్సరీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ తోడ్పాటుతో నర్సరీ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీని ఏర్పాటు చేశాయి. రూ.3 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటైన ఈ కంపెనీలో ఇప్పటికే 300 నర్సరీలు షేర్‌ హోల్డర్స్‌గా చేరాయి.

మూడు చోట్ల సేవా కేంద్రాలు
కంపెనీ ఏర్పాటులో తొలి ప్రయత్నంగా విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరుల్లో అత్యున్నత ప్రమాణాలతో నర్సరీ సేవా కేంద్రాల పేరిట ఉమ్మడి మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా నర్సరీ రైతులకు మొక్కలతో పాటు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచుతారు.

దేశీయ, విదేశీ రకాలను స్థానికంగా అత్యున్నత ప్రమాణాలతో ఉత్పత్తి చేయడంతో పాటు వాటిని ఒకేచోట చేర్చి రైతులకు, వినియోగదారులకు అందుబాటులోకి తెస్తారు. ఈ మార్కెట్ల ద్వారా కొత్త రకాల మొక్కల ఉత్పత్తి గణనీయంగా పెరగనుంది. దేశీయ మొక్కల మార్కెట్లో ప్రతి నర్సరీ ఉత్పత్తిదారులుగా మారడంతోపాటు డిమాండ్‌ తగినట్టుగా ఉత్పత్తిని పెంచి లాభాలు ఆర్జించనున్నారు.

ఉత్పత్తిదారులుగా నర్సరీ రైతులు
నర్సరీ రంగాన్ని వ్యవస్థీకృతం చేయడంతోపాటు స్థానికంగా ఉత్పత్తిని పెంచడం, నర్సరీ రైతుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా కంపెనీని ఏర్పాటు చేశాం. మాతో కలిసి వచ్చే ప్రతి నర్సరీ రైతుని ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్దడం తద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం. తద్వారా నర్సరీ రంగంలో ఏపీని నంబర్‌ వన్‌గా నిలపడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం.
– గోపాలం రవీంద్ర, చైర్మన్, నర్సరీ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ

ప్రభుత్వ తోడ్పాటు మరువలేనిది
కంపెనీ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు మరువలేనిది. ఆంధ్రప్రదేశ్‌ నర్సరీ గ్రోయర్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన నర్సరీ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీకి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన రెడ్డి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.       
– ఆకుల చలపతిరావు, మేనేజింగ్‌ డైరెక్టర్, నర్సరీ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ

మూడేళ్లలో రూ.100 కోట్ల వ్యాపారం
కంపెనీ ద్వారా నర్సరీలను ప్రత్యామ్నాయ వ్యాపార కేంద్రాలుగా అభివృద్ధి చేయడం, నర్సరీ అనుబంధ పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చే పరిశ్రమలను ఏర్పాటుతో పాటు రైతులతో కాంట్రాక్టు వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నారు. కంపెనీ ద్వారా తొలి ఏడాది రూ.10 కోట్లు రెండో ఏడాది రూ.50 కోట్లు, మూడో ఏడాది రూ.100 కోట్ల మార్క్‌ను అందుకోవాలని.. తద్వారా మొక్కల ఉత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్‌ను దేశంలో మొదటి స్థానంలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇప్పటికే సవరించిన నర్సరీల చట్ట పరిధిలోకి శాశ్వత పండ్ల మొక్కలను ఉత్పత్తి చేసే నర్సరీలతో పాటు షేడ్‌ నెట్‌/పాలీ హౌస్‌ నర్సరీలను తీసుకురావడంతోపాటు 2,930 నర్సరీలకు ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు