WorkFromHomeTowns: 24/7 విద్యుత్‌ సరఫరా.. హై స్పీడ్‌ ఇంటర్‌నెట్‌

19 Nov, 2021 19:03 IST|Sakshi
సిద్ధమైన వర్క్‌ ఫ్రమ్‌ హోం టౌన్‌ 

జిల్లాలో నాలుగు వర్క్‌ ఫ్రమ్‌ హోం టౌన్ల ఏర్పాటు 

ఒక్కో స్టేషన్‌లో 30 మంది వరకూ పనిచేసుకునే అవకాశం 

ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో సౌకర్యాలు 

ప్రాథమికంగా ఏ,బీ షిఫ్ట్‌ ఉద్యోగులకు అవకాశం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : జిల్లాలో పని కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఇంటి నుంచే పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేకంగా వర్క్‌ ఫ్రమ్‌ హోం టౌన్‌ (డబ్ల్యూహెచ్‌టీ)లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో ప్రధానంగా ఐటీ, ఐటీ ఆధారిత ఉద్యోగులు వెళ్లి పనిచేసుకునే వెసులుబాటు కలగనుంది. పూర్తిస్థాయిలో ఆఫీసు వాతావరణం ఉండే విధంగా వీటిని తీర్చిదిద్దుతున్నారు. జిల్లాలో మొదటి విడతలో నాలుగు హోంటైన్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 24/7 విద్యుత్‌ సరఫరాతో పాటు హై స్పీడ్‌ ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉండనుంది.

ఒక్కో ప్రాంతంలో 30 మంది ఉద్యోగుల వరకూ పనిచేసుకొనే సదుపాయం ఉంటుంది. నగర ప్రాంతంలో 3 టౌన్లు, అనకాపల్లిలో మరో హోంటౌన్‌ ఏర్పాటు చేస్తున్నారు. అనకాపల్లి హోంటౌన్‌లో నెలకు రూ.4 వేలు, వైజాగ్‌లోని హోంటౌన్‌లో రూ.5 వేల మేరకు నెలకు అద్దె రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ తమకు సీటు కావాలనుకునే సంస్థలు లేదా ఉద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టోల్‌ ఫ్రీ నెంబరును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ద్వారా ఈ హోంటౌన్లను ఏర్పాటు చేస్తోంది.  

పూర్తి స్థాయిలో ఆఫీసు వాతావరణంలో... 
కరోనా నేపథ్యంలో మెజార్టీ ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు ఇంటి నుంచి (వర్క్‌ ఫ్రమ్‌ హోం) పనిచేసే విధానాన్నే అవలంబిస్తున్నాయి. ఫలితంగా ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాల్సి వస్తోంది. ఇంట్లో ప్రత్యేకంగా ఒక రూమ్‌ లేకపోవడం వల్ల కొత్త ఇంటిని చూసుకోవడమో.. ప్రత్యేకంగా ఒక గదిని అద్దెకు తీసుకోవడమో చేయాల్సి వస్తోంది. మరోవైపు కరెంటు, ఇంటర్‌నెట్‌ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేకంగా వర్క్‌ ఫ్రమ్‌ హోంటౌన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖలో ప్రస్తుతం అనిల్‌ నీరుకొండ ఇంజనీరింగ్‌ కాలేజీ (అనిట్స్‌), మధురవాడలోని ఐటీ ఇంకుబేషన్‌ సెంటర్‌లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. గాజువాక వద్ద కూడా మరో కేంద్రం ఏర్పాటు కానుంది.

ఇక అనకాపల్లిలో దాడి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఆఫీసులో ఉన్న సౌకర్యాలను కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఒక కెఫటేరియా... ఏసీ సదుపాయంతో పాటు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్, ఇంటర్‌నెట్‌ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. కొన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ‘ప్రస్తుతానికి కేవలం డే షిఫ్టుల వారికే ఇక్కడ పనిచేసుకునే సౌకర్యం కల్పిస్తున్నాం. అంటే ఏ, బీ షిఫ్టులు ఉన్న ఉద్యోగులు ఇక్కడకు వచ్చి పనిచేసుకునే వెసులుబాటు ఉంది. రానున్న రోజుల్లో డిమాండ్‌ను బట్టి సీ షిఫ్టుల వారికి కూడా అవకాశం కల్పిస్తాం’ అని నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. హోంటౌన్ల ద్వారా పనిచేయాలనుకునేవారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్‌ ఏపీఐటీ డాట్‌ ఏపీ డాట్‌ జీవోవీ డాట్‌ ఇన్‌డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.  

మరిన్ని వార్తలు