పారిశ్రామిక హబ్‌గా వైఎస్సార్‌ జిల్లా.. 1.30 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

2 Nov, 2022 13:07 IST|Sakshi

కొప్పర్తిలో రెడీమేడ్‌ గార్మెంట్‌ 

రూ. 46 కోట్లతో పరిశ్రమ 

2050 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు 

వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్న ఉత్పత్తులు 

ఇప్పటికే స్థలాన్ని కేటాయించిన ఏపీఐఐసీ 

వేగంగా కొనసాగుతున్న సెంచురీ ప్లైవుడ్‌ పరిశ్రమ పనులు 

జిల్లాలో 1.30 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 

సాక్షి, కడప: కొప్పర్తి పారిశ్రామికవాడలో పరిశ్రమల స్థాపన వేగంగా సాగుతోంది. ఇప్పటికే పలు పరిశ్రమలు ఇక్కడికి తరలి రాగా, మరికొన్ని కొత్త పరిశ్రమలు కొప్పర్తి కేంద్రంగా ఏర్పాటయ్యేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా రెడీమేడ్‌ గార్మెంట్‌ పరిశ్రమ ఏర్పాటుకు పంక్చుయేట్‌ వరల్డ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (టెక్ప్సోపోర్ట్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ యొక్క అనుబంధ సంస్థ) పరిశ్రమ సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.46 కోట్లతో పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. 2050 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఇప్పటికే సదరు కంపెనీ కొప్పర్తిలో స్థలం కోసం ఏపీఐఐసీకి దరఖాస్తు చేసుకోగా ఈ మేరకు స్థలం కేటాయిస్తూ ఏపీఐఐసీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కొప్పర్తిలో 165, 167, 168 ప్లాట్ల పరిధిలో 21.17 ఎకరాల స్థలాన్ని రెడీమేడ్‌ గార్మెంట్‌ పరిశ్రమకు కేటాయించింది. భవిష్యత్తులో అవసరమైతే మరికొంత స్థలాన్ని ఇచ్చేందుకు ఏపీఐఐసీ అంగీకారం తెలిపింది. దీంతో సదరు కంపెనీ కొప్పర్తిలో పరిశ్రమ పనులు మొదలు పెట్టింది. వచ్చే ఏడాదిలో గార్మెంట్‌ పరిశ్రమ ఉత్పత్తులు ప్రారంభించనుంది.  

మల్టీ ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ 
ఏపీ మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొప్పర్తిలో మల్టీ ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు కానుంది. ఇక్కడ మిక్సింగ్‌ ప్లాంటును ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఏపీ మార్క్‌ఫెడ్‌ ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. మిక్సింగ్‌ ప్లాంటు ఏర్పాటుకు స్థలం కేటాయించాలని విన్నవించింది. ఈ మేరకు ఏపీ మార్క్‌ఫెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఇప్పటికే కొప్పర్తి పారిశ్రామిక వాడను సందర్శించారు. పారిశ్రామికవాడలోని ప్లాట్‌ నెంబరు 15ను కేటాయించాలని కోరగా అందుకు ఏపీఐఐసీ అంగీకారం తెలిపింది.  

పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి 
జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే జమ్మలమడుగు వద్ద స్టీల్‌ప్లాంటు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. మరోవైపు పులివెందులలోని ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పార్కులో రూ. 110 కోట్లతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ రీటైల్‌ లిమిటెడ్, ఇదే ప్రాంతంలో రూ. 600 కోట్లతో అపాచీ కంపెనీ లెదర్‌ పరిశ్రమ బూట్లు, పాదరక్షల తయారీ కంపెనీని ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల 4000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

కొప్పర్తి ప్రాంతంలో జిల్లా పారిశ్రామిక ప్రగతిని ప్రతిబింబించేలా రూ.1580 కోట్ల వ్యయంతో అధునాతన వసతులు కల్పిస్తూ 3167 ఎకరాల్లో వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ను ఏర్పాటు చేశారు. 801 ఎకరాల్లో వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లను ప్రారంభించారు. దీంతో దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. బద్వేలు నియోజకవర్గంలోని కృష్ణపట్నం–బళ్లారి జాతీయ రహదారిలో గోపవరం వద్ద సెంచురీ ఫ్లైవుడ్‌ పరిశ్రమను కంపెనీ నెలకొల్పుతోంది.

రూ.1600 కోట్ల పెట్టుబడులతో 589 ఎకరాల్లో ఈ పరిశ్రమ ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. మూడు వేల మందికి ఉద్యోగాలు, 4000 మంది రైతులకు ఉపాధి లభించనుంది. మొత్తంగా జిల్లాలో వేల కోట్లతో ఏర్పాటవుతున్న పరిశ్రమల పరిధిలో 1.30 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.  

పారిశ్రామిక హబ్‌గా జిల్లా 
వైఎస్సార్‌ జిల్లా పారిశ్రామిక హబ్‌గా మారబోతోంది. ఇప్పటికే కొప్పర్తి, పులివెందుల, గోపవరం ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. వీటన్నింటిలో 1.30 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి.  సీఎం ప్రత్యేక శ్రద్ధతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెట్టనుంది.
– రాజోలి వీరారెడ్డి, రాష్ట్ర పరిశ్రమలశాఖ సలహాదారు, కడప. 

మరిన్ని వార్తలు