‘కొప్పర్తి’లో కేంద్ర బృందం

8 May, 2022 03:26 IST|Sakshi
కొప్పర్తిని సందర్శించిన మినిస్ట్రీ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ ప్రతినిధులు

టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుకు అనుకూలతలపై ఆరా

వైఎస్సార్‌–జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో మౌలిక వసతుల పరిశీలన

టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుకు అనుకూలమన్న కేంద్ర ప్రతినిధులు

1,186 ఎకరాల్లో సుమారు రూ.1,100 కోట్లతో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు 

సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలోని వైఎస్సార్‌–జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో మినిస్ట్రీ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ ప్రతినిధులు హెచ్‌కే నంద, డిప్యూటీ సెక్రటరీ పూర్ణేందుకాంత్, ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్‌బాబు, రాష్ట్ర పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి, ఏపీఐఐసీ అధికారుల బృందం శనివారం పర్యటించింది. ఇక్కడ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఏర్పాటుకు గల అనుకూలతలు మౌలిక వసతులను కేంద్ర బృందం పరిశీలించింది. పార్క్‌ అభివృద్ధికి అవసరమైన విద్యుత్, నీటి సౌకర్యాలను సైతం వీక్షించింది.

రాష్ట్రంలో పత్తి ఉత్పత్తి, టెక్స్‌టైల్స్‌ ఎగుమతులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని కేంద ప్రతినిధులు పేర్కొన్నట్లు సమాచారం. పక్కనే విమానాశ్రయం ఉండటం.. కడప, తిరుపతి, బెంగళూరు విమానాశ్రయాలు సమీపంలోనే ఉండటం.. కృష్ణపట్నం, చెన్నై పోర్టులు సైతం అందుబాటులో ఉండటంతో ఇక్కడ టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుకు మరింత అనుకూలమని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పేర్కొన్నారు. కృష్ణాపురం నుంచి కొప్పర్తి వరకు రైల్వేలైన్‌ కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రతినిధులు సూచించారు. ఇక్కడి నుంచి ఎగుమతుల కోసం ఏవియేషన్‌ అధికారులతోనూ రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని సూచించారు.

1,186 ఎకరాల్లో టెక్స్‌టైల్‌ పార్క్‌
కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో 1,186 ఎకరాల్లో ఈ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు కానుంది. ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్స్‌ రీజియన్‌ అండ్‌ అపెరల్‌ (పీఎం మిత్ర) పథకం కింద కొప్పర్తిలో టెక్స్‌టైల్స్‌ పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమల శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించగా.. కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుమారు రూ.1,100 కోట్లతో కొప్పర్తిలోని వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

పీఎం మిత్ర కింద కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ విభాగం నుంచి పార్క్‌ అభివృద్ధికి 30 శాతం ఆర్థిక సాయం అందించనుంది. మిగిలిన 70 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో పాటు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చొరవతో జిల్లా పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా సాగుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి పేర్కొన్నారు. ఈ టెక్స్‌టైల్‌ పార్క్‌ వల్ల 10 వేల మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని ఆయన చెప్పారు. 

మరిన్ని వార్తలు