రాష్ట్ర ఆక్వాకల్చర్‌ అభివృద్ధి సంస్థ ఏర్పాటు

11 Mar, 2021 05:23 IST|Sakshi

చైర్మన్‌గా సీఎం వైఎస్‌ జగన్, వైస్‌ చైర్మన్‌గా పశుసం్చవర్థక మంత్రి.. 

24 మంది సభ్యులతో కమిటీ  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆక్వాకల్చర్‌ అభివృద్ధి సంస్థ (ఏపీ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఏర్పాటైంది. దీనితోపాటు ఎగ్జిక్యూటివ్, టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీలను, జిల్లా స్థాయి అమలు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ మేరకు వ్యవసాయ, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆక్వాకల్చర్‌ అభివృద్ధి సంస్థకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వైస్‌ చైర్మన్‌గా పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజును నియమించారు. కో వైస్‌ చైర్మన్‌గా ఈ రంగంలో నిపుణుడ్ని ప్రభుత్వం నామినేట్‌ చేయనుంది.

అథారిటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌.. మెంబర్‌ సెక్రటరీగా వ్యవహరించనున్న ఈ కమిటీలో ఏపీ వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి సహా 24 మందిని సభ్యులుగా నియమించారు. అలాగే పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చైర్మన్‌గా, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ/ప్రిన్సిపల్‌ కార్యదర్శి/కార్యదర్శిలు వైస్‌ చైర్మన్‌గా ఏర్పాటైన అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి ఏపీఎస్‌ఏడీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌.. మెంబర్‌ సెక్రటరీగా వ్యవహరించనుండగా, 12 మందిని సభ్యులుగా నియమించారు. అథారిటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ చైర్మన్‌గా ఏర్పాటు చేసిన టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీకి కాకినాడ ఎస్‌ఐఎఫ్‌టీ ప్రిన్సిపల్‌.. మెంబర్‌ సెక్రటరీగా వ్యవహరించనుండగా, 19 మందిని సభ్యులుగా నియమించారు. జిల్లా స్థాయి అమలు కమిటీకి కలెక్టర్‌ చైర్మన్‌గా, జిల్లా మత్స్యశాఖాధికారి మెంబర్‌ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో 12 మంది సభ్యులుగా ఉంటారు.   

మరిన్ని వార్తలు