పిట్ట కథలు వద్దు: పవన్‌కు ఎస్తేర్‌ కౌంటర్‌

12 Oct, 2020 12:05 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాజధాని ప్రాంత సమీపంలోని ఉద్దండరాయుని పాలెంకు చెందిన పులి చినలాజర్‌ మృతిపై సోషల్‌ మీడియా వేదికగా అసత్య ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ సైతం ఆయన మరణంపై చేసిన ట్వీట్‌ వివాదంగా మారింది. వారి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే తన తండ్రి మరణాన్ని వక్రీకరిస్తున్నారని లాజర్‌ కుమార్తె ఎస్తేర్‌ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేసిన ఆమె.. పవన్ కళ్యాణ్‌, లోకేష్‌ కామెంట్స్‌ను తిప్పికొట్టారు. (మా నాన్న మృతిపై రాజకీయాలా?)

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మానసిక వేధింపుల కారణంగానే చినలాజర్‌ మృతిచెందారన్న పవన్‌ ట్వీట్‌కు ఎస్తేర్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ‘ఏమయా పవన్ ఇప్పుడు గుర్తొచ్చారా మా నాన్న గారు. ఆయన అమాయకత్వం అడ్డం పెట్టుకుని ఆత్మీయ తండ్రి అంటూ పొగడ్తలతో మురిపించి నీ పబ్బం గడుపుకున్నావు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఏ పంచన చేరావు? ఇప్పుడు సానుభూతి చెప్పుకొస్తున్నావు. మా నాన్న గారు చనిపోయి పుట్టెడు దుఖఃలో ఉన్నాము ఆయన మరణాన్ని మీ నీచ రాజకీయాల కోసం వాడుకుని పబ్బం గడుపుకో వద్దు. చేతనైతే నాలుగు ఆదరణ మాటలు చెప్పండి లేకుంటే మౌనంగా ఉండండి. అంతే గాని రాజధాని కోసం గుండె ఆగిందంటూ... దాని కోసం దీని కోసం అంటూ పిట్ట కథలు అల్లొద్దు. అనారోగ్యం కారణంగానే నా తండ్రి మరణించారు. ప్రభుత్వ వేధింపులు అంటూ చెత్త రాతలు రాయకండి’ అని పవన్‌కు సమాధామనిచ్చారు.

ఇక లాజర్‌ మరణంపై లోకేష్‌ చేసిన పోస్టుపై సైతం ఎస్తేర్‌ మండిపడ్డారు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలంటూ ట్విట్టర్‌లోనే ఘాటుగా బదులిచ్చారు. ‘మా నాన్న గురించి ఎవరు చెప్పారు నీకు. మా నాన్న మృతిని కంపు రాజకీయాలకు వాడుకోవడానికి నీవెవరు? ఏనాడైనా మా ఊరు వచ్చావా? మా నాన్న గారిని పరామర్శించి మాట్లాడావా? లంక భూముల సొసైటీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు.. భూముల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా కనీసం ముఖాలైనా చూడలేదు మీరు. మా నాన్న రాజధాని గురించి కాదు. ఆరోగ్యం బాగొక చనిపోయారు. రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలంటే అందరికీ సమన్యాయం జరగాలి, మన స్వార్థం చూసుకోకూడదు అని జగన్‌ గారి నిర్ణయాన్ని స్వాగతించిన వ్యక్తిత్వం. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి’ అంటూ బదులిచ్చారు.

 

మరిన్ని వార్తలు