ఏపీలో ఆర్బీకేలు అద్భుతం 

13 Oct, 2022 03:28 IST|Sakshi
కృష్ణా జిల్లా గండిగుంటలోని ఆర్బీకేలో అందిస్తున్న సేవలను తెలుసుకుంటున్న ఇథియోపియా బృందం

ఆర్బీకే సాంకేతికతను అందిపుచ్చుకుంటాం.. రైతు సేవలు గ్రామ స్థాయికి తీసుకెళ్తాం 

ల్యాబ్‌ టు ల్యాండ్‌ కాన్సెప్ట్‌ చాలా బాగుంది.. ప్రభుత్వ ఆలోచనలు చాలా ఇన్నోవేటివ్‌గా ఉన్నాయి 

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు 

ఇథియోపియా వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్‌ మెకోనెన్‌ ఐమెర్‌ 

గన్నవరం ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్, ఆర్బీకే చానల్‌ సందర్శన 

గండిగుంట ఆర్బీకేని పరిశీలించిన ఇథియోపియా బృందం 

సాక్షి, అమరావతి/ఉయ్యూరు: ‘రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. మేము ఊహించిన దానికంటే చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాయి. ఆర్బీకేలు గ్రామ స్థాయిలో రైతులకు అందిస్తున్న సేవలు చాలా ఇన్నొవేటివ్‌గా ఉన్నాయి. కియోస్క్‌ ద్వారా రైతులే నేరుగా వారికి కావల్సిన ఇన్‌పుట్స్‌ బుక్‌ చేసుకోవడం, సకాలంలో వాటిని అందించడం అద్భుత విధానం. ల్యాబ్‌ టు ల్యాండ్‌ కాన్సెప్ట్‌ కింద పరిశోధన ఫలితాలు, విస్తరణ కార్యక్రమాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లడం నిజంగా మంచి ఆలోచన. ప్రపంచంలో ఎక్కడా ఈ తరహా సేవలందిస్తున్నట్టు వినలేదు.

ఈ తరహా ఆలోచన చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ను అభినందిస్తున్నాం’ అంటూ ఇథియోపియా దేశ వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్‌ మెకోనెన్‌ ఐమెర్‌ ప్రశంసించారు. రాష్ట్రంలో ఆర్బీకే వ్యవస్థ గురించి తెలుసుకున్న ఇథియోపియా ప్రభుత్వం, వాటిని తమ దేశంలో కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆర్బీకే వ్యవస్థ పరిశీలనకు ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్‌ మెకోనెన్‌ ఐమీర్‌ నేతృత్వంలో ఓ బృందాన్ని పంపింది.

ఆ బృందం బుధవారం తొలుత గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం (ఐసీసీ), ఆర్బీకే చానల్‌ను, ఆ తర్వాత కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట ఆర్బీకే–2ను  సందర్శించింది. ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌లో రైతుల నుంచి వస్తున్న కాల్స్‌ను రిసీవ్‌ చేసుకుంటున్న తీరు, అక్కడున్న శాస్త్రవేత్తలు, అధికారులు బదులిస్తున్న తీరును పరిశీలించింది. ఆర్బీకే చానల్‌ ద్వారా రైతులకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారో తెలుసుకుంది. 

గండిగుంట ఆర్బీకేలోనే రెండున్నర గంటలు 
ఆర్బీకేల సేవలను తెలుసుకునేందుకు ఈ బృందం గండిగుంట ఆర్బీకేలో రెండున్నర గంటల పాటు గడిపింది. రైతులతో మమేకమైంది. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల స్టాల్స్‌ను లకించింది. కియోస్క్‌ ద్వారా రైతులు ఇన్‌పుట్స్‌ బుక్‌ చేసుకుంటున్న విధానాన్ని పరిశీలించింది. డిజిటల్‌ లైబ్రరీ, కొనుగోలు కేంద్రం, వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రం, వెటర్నరీ అంబులెన్స్, రైతు రథం, పొలం బడి క్షేత్రం ఇలా ప్రతి ఒక్కటీ పరిశీలించి వాటి పనితీరు, సేవలను తెలుసుకుంది. వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు, విధులు, బాధ్యతలపై బృందం సభ్యులు ఆరా తీసారు.

మూడేళ్లుగా ఆర్బీకేలు అందిస్తున్న సేవలను వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య వివరించారు. ఆర్బీకేలొచ్చిన తర్వాత వ్యవసాయ అవసరాల కోసం గ్రామం విడిచి వెళ్లడంలేదని రైతులు ఈ బృందానికి వివరించారు. అనంతరం విజయవాడలో అధికారులతో సమావేశమయ్యారు. శాఖలవారీగా అమలు చేస్తున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలను అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఈ బృందానికి వివరించారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తాం 
ఆర్బీకేలు నిజంగా రోల్‌ మోడల్‌గా ఉన్నాయని ఇథియోపియా వ్యవసాయ మంత్రి చెప్పారు. వీటి సాంకేతికతను అందిపుచ్చుకుంటామని, తమ దేశంలో కూడా ఈ సేవలు అందించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తామని చెప్పారు. వ్యవసాయాధార దేశమైన ఇథియోపియాలో రైతులకు నాణ్యమైన సేవలందించడమే లక్ష్యమని చెప్పారు.

సౌత్‌సౌత్‌ కో ఆపరేషన్‌ సమావేశంలో భారతప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న కార్యక్రమాలు తెలుసుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పనితీరు, సీఏం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కొనియాడారు. ఈ పర్యటనలో ఇథియోఫియా బృందం సభ్యులతో పాటు వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖల కమిషనర్లు చేవూరు హరికిరణ్, శ్రీధర్, కన్నబాబు, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ అమరేంద్రకుమార్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు