నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు.. బాగున్నారా..

13 Aug, 2022 17:23 IST|Sakshi

ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థిని కావడం గర్వకారణం

ఇథియోపియా కేంద్ర మంత్రి ఎర్గోగి టిస్‌ఫాయే

సాక్షి, విశాఖపట్నం: ‘బాగున్నారా.. కాఫీ చాలా చాలా బాగుంది.. నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు’ అంటూ ఇథియోపియా కేంద్ర మంత్రి ఎర్గోగి టిస్‌ఫాయే తెలుగులో మాట్లాడి అబ్బురపరిచారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంత్రపాలజీ విభాగంలో పీహెచ్‌డీ చేశానని, ఆ సమయంలో విశాఖలో ఉన్నప్పుడు కొన్ని తెలుగు పదాలను నేర్చుకున్నానని చెప్పారు. పూర్తిగా తెలుగులో మాట్లాడలేకపోయినా, అర్థం చేసుకోగలనన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ తనకు తల్లితో సమానమని, వర్సిటీతో కలిసి పనిచేస్తామని చెప్పారు. శుక్రవారం ఏయూకు విచ్చేసిన ఆమె ఇష్టాగోష్టిలో పలు విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..  


ఐసీసీఆర్‌ నుంచి విశిష్ట పూర్వవిద్యార్థి పురస్కారం
 
నేను ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌(ఐసీసీఆర్‌) అందించిన స్కాలర్‌షిప్‌తో చదువుకున్నాను. ఏయూలో ప్రొఫెసర్ల బోధన నాకు ఎంతో నచ్చింది, ఉపకరించింది. మానవ అధ్యయనానికి భారత్‌ సరైన వేదిక అని నాకు అనిపించింది. ఇక్కడ విభిన్న సంస్కృతులు, భాషలు, వైవిధ్యాల సమ్మేళనం దర్శనమిస్తుంది. ఐసీసీఆర్‌ నుంచి విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కారం అందుకోవడం ఆనందాన్ని ఇచ్చింది. ఏయూ విద్యార్థిగా నేను గర్విస్తాను. 

భారత్‌ను ఎంచుకోమంటాను  
ప్రతీ సంవత్సరం ఇథియోపియా నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. వీరికి భారత్‌కు వెళ్లాలని నేను సూచిస్తున్నాను. ముఖ్యంగా ఏయూలో చదువుకోవాలని, ఇక్కడ వాతావరణం, ప్రజలు బాగుంటారని వారికి పలు సందర్భాలలో తెలియజేస్తున్నా. వాతావరణం, ఆహారం, ప్రజలు తదితర అంశాల్లో భారత్, ఇథియోపియా దేశాల మధ్య సారూప్యత అధికంగా ఉంటుంది. 


ఏయూతో కలసి పని చేస్తాం  

నాకు తల్లితో సమానమైన ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలసి పనిచేస్తాం. స్టార్టప్‌ రంగంలో ఇథియోపియాకు కొంత సహకారం, మార్గదర్శకత్వం అవసరం. ఏయూ ఇప్పటికే ఈ రంగంలో మంచి ప్రగతిని సాధించింది. ఈ దిశగా ఏయూ సహకారం తీసుకుంటాం. డ్యూయల్‌ డిగ్రీ కోర్సులను సైతం నిర్వహించే ప్రదిపాదన ఉంది. 

తెలుగు ప్రజలు మంచివారు  
నా పీహెచ్‌డీ పూర్తిచేసే క్రమంలో తెలుగు ప్రజలతో ఉండే అవకాశం లభించింది. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. విశాఖ సుందరమైన నగరం. ఇక్కడ ఉన్న సమయంలో కొన్ని తెలుగు పదాలను నేర్చుకున్నారు. ఎవరు, ఎంత.. ఇలా అనేక పదాలను నేను ఇప్పటికీ మరచిపోలేదు. 


ఉన్నతంగా ఎదిగారు
 
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించిన ఇథియోపియా దేశస్తులు ఉన్నత స్థితిలో రాణిస్తున్నారు. విభిన్న శాఖల్లో మంత్రులుగా, విశ్వవిద్యాలయాల ఉపకులపతులుగా సేవలు అందిస్తున్నారు. వీరంతా ఏయూ పూర్వవిద్యార్థులే అనే విషయం మరువలేదు. 


ఇథియోపియాలో భారత్‌ పెట్టుబడులు 

ఇథియోపియా దేశంలో అనేకమంది భారతీయులు పెట్టుబడులు పెడుతున్నారు. వాటిని స్వాగతిస్తున్నాం. అదే విధంగా పెద్దసంఖ్యలో భారతీయులు ఇథియోపియా విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నారు. మా దేశంలో శాంతిని కాంక్షిస్తాం. 

ఇండియా ఇన్‌క్రెడిబుల్‌ 
నేను తొలిసారిగా విద్యార్థిగా ఇథియోపియా నుంచి భారత్‌కు వచ్చే సమయంలో విమానాశ్రయంలో ‘ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా’ అనే పదాన్ని చూశాను. ఇది నిజమా అనే భావన నాకు కలిగింది. తరువాత నేను భారత్‌లో ఉన్న కాలంలో చూసిన పరిస్థితులు, అనుభవాల తరువాత ఇది సరిగ్గా సరిపోతుందనే భావన నాకు కలిగింది. 


ఇథియోపియాలో ఏయూ ముద్ర 

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేపట్టే సంస్కరణలు, అభివృద్ధి ఆలోచనలు ఇథియోపియాపై ప్రభావం చూపుతాయి. ఇక్కడ అధికారులు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు విద్యార్థుల నుంచి ఇథియోపియాకు చేరతాయి. పరోక్షంగా ఇథియోపియా విద్యా వ్యవస్థను ఏయూ ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. (క్లిక్: పెంపుడు కుక్కతో ‘టెక్కీ’ లవ్‌ జర్నీ.. ఎందుకో తెలుసా..?)

మరిన్ని వార్తలు