16 వేలమంది శాశ్వత నివాసాలకు తరలింపు

19 Aug, 2021 03:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పోలవరం నిర్వాసితుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నాం

రాడార్‌ సర్వే చేస్తున్నాం

జాతీయ పర్యవేక్షణ కమిటీ ముందు ఏపీ అధికారులు

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నామని ప్రాజెక్టుల పరిహారం, పునరావాస జాతీయ పర్యవేక్షణ కమిటీ (ఎన్‌ఎంసీఆర్‌ఆర్‌)కి ఆంధ్రప్రదేశ్‌ అధికారులు తెలిపారు. నిర్వాసితుల కోసం రాడార్‌ సర్వే చేస్తున్నామని, 16 వేలమందిని శాశ్వత నివాసాలకు తరలించామని చెప్పారు. ఎన్‌ఎంసీఆర్‌ఆర్‌ చైర్మన్‌ అజయ్‌టిర్కీ ఆధ్వర్యంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఏపీ ప్రభుత్వ అధికారులు, ఫిర్యాదీ పెంటపాటి పుల్లారావు, న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కారణంగా తమ రాష్ట్రంలో 373 గ్రామాలను తరలించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు తెలిపారు. కాఫర్‌డ్యాం వల్ల ముంపు అంటూ చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. ప్రాజెక్టు ప్రభావం పడే ప్రజల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు.

నిర్వాసితుల త్యాగాలు గుర్తించి రూ.3 లక్షల చొప్పున అదనంగా ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. నిర్వాసితులను ఆదుకోవడానికి చర్యలు చేపడుతుంటే ఫిర్యాదులు, కేసులతో ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో ఇంకా బహిరంగ విచారణ పూర్తికాలేదని జలశక్తి శాఖ అధికారులు తెలిపారు. ముంపు ఎంత అని తేలిన తర్వాత కరకట్టలు నిర్మించి ఆయా వివరాలన్నీ కమిటీకి అందజేస్తామన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల గిరిజనులపై ప్రభావం గుర్తించడానికి జలశక్తి, సామాజిక న్యాయ, గిరిజన శాఖలతో కమిటీ వేసినప్పటికీ కరోనా వల్ల పరిశీలించలేదని ఫిర్యాదీ పెంటపాటి పుల్లారావు, న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు.

విలువైన భూములకు తగిన విధంగా పరిహారం అందడం లేదని, నిర్వాసితులను బలవంతంగా తరలిస్తున్నారని చెప్పారు. నిర్వాసితులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు.నిర్వాసితులను బలవంతంగా తరలించడంలేదని ఏపీ అధికారులు తెలిపారు. అనంతరం నిర్వాసితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని అధికారులకు కమిటీ చైర్మన్‌ సూచించారు. ఫిర్యాదులోని అంశాలపై పాయింట్ల వారీగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.  

మరిన్ని వార్తలు