1 నుంచి 9వ తరగతి వరకు అందరూ పాస్‌

21 Apr, 2021 03:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పరీక్షలు లేకుండానే పైతరగతులకు..

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు స్కూల్స్‌ బంద్‌ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2020–21) 1 నుంచి 9వ తరగతి వరకు అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్ని మంగళవారం నుంచి మూసివేశామని, ఈ తరగతుల వారికి సోమవారమే చివరి వర్కింగ్‌ డే అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

1 నుంచి 9వ తరగతి విద్యార్థులందరినీ ఎటువంటి పరీక్షలు లేకుండా పాస్‌ చేస్తూ పైతరగతులకు ప్రమోట్‌ చేస్తున్నామని, వీరికి వేసవి సెలవులు ప్రకటించామని, డ్రై రేషన్‌ను పంపిణీ చేస్తామని వివరించారు. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ పదో తరగతి క్లాసులను, పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి బోధించే టీచర్లు హెడ్మాస్టర్‌ ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం స్కూల్స్‌కు హాజరుకావాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు స్కూల్స్‌లోనే పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం పెట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు.  

మరిన్ని వార్తలు