స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సన్నద్ధం

15 Aug, 2020 06:21 IST|Sakshi
వేడుకలకు సిద్ధమైన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం

విజయవాడలో జాతీయ జెండాను నేడు ఎగురవేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌

కరోనా దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే అతిథులకు ఆహ్వానం

సాక్షి, అమరావతి: రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన 10 శకటాలను స్టేడియంలో సిద్ధంచేశారు. కోవిడ్‌ విపత్కర పరిస్థితులను ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నది,  తదితర కార్యక్రమాలు ప్రతిబింబించేలాగా ఈ శకటాలను రూపొందించారు. అలాగే..

► కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు.
► కోవిడ్‌ వారియర్స్‌లో భాగంగా పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా భాగస్వాములు కానున్నారు.
► కరోనా నుంచి కోలుకున్న వారిని కూడా వేడుకలకు ఆహ్వానించారు. భౌతిక దూరం పాటిస్తూ స్టేడియంలో సీటింగ్‌ ఏర్పాట్లుచేశారు.
► ఉ.9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఆహ్వానితులు, పాస్‌లున్న వారు ఉ.8 గంటలకల్లా సభా ప్రాంగణంలో కేటాయించిన సీట్లలో కూర్చోవాలని అధికారులు కోరారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యుత్‌ దీపాలతో వెలిగిపోతున్న వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం 

రాజ్‌భవన్‌లో ‘ఎట్‌  హోం’ రద్దు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ‘ఎట్‌హోం’ కార్యక్రమం ఈ ఏడాది నిర్వహించకూడదని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ నిర్ణయించారు. ఏటా ఆగస్టు 15, జనవరి 26న ‘ఎట్‌హోం’ కార్యక్రమం పేరిట ప్రముఖులకు రాజ్‌భవన్‌లో విందు ఇవ్వడం సంప్రదాయం. కానీ, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది దీనిని నిర్వహించకూడదని గవర్నర్‌ నిర్ణయించినట్టు రాజ్‌భవన్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా