ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల కన్నుమూత

3 May, 2021 08:24 IST|Sakshi
భాస్కర రామారావు(ఫైల్‌)- ప్రభాకర చౌదరి (ఫైల్‌)

పెదపూడి/రాజమహేంద్రవరం సిటీ: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు (72) కరోనా బారిన పడి ఆదివారం తెల్లవారుజామున విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన, భార్య జగ్గయమ్మ 20 రోజుల క్రితం కోవిడ్‌ బారినపడ్డారు. వెంటనే విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన వారం రోజుల్లో జగ్గయమ్మకు కరోనా వైద్య పరీక్షల్లో నెగిటివ్‌ ఫలితాలు రావడంతో ఇంటికి వచ్చేశారు.

భాస్కర రామారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ పెద్దాడ గ్రామానికి 1971 నుంచి 1981 వరకు ఏకగ్రీవ సర్పంచ్‌గా పని చేశారు. 1982లో సామర్లకోట సమితి అధ్యక్షునిగా పనిచేశారు. టీడీపీలో చేరి 1984లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా, 1994 నుంచి 1999 వరకు, 1999 నుంచి 2004 వరకు పెద్దాపురం ఎమ్మెల్యేగా, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 2012 నుంచి 2017 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. 2013లో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరి 2014 డిసెంబర్‌లో మళ్లీ టీడీపీలో చేరారు. సీనియర్‌ నేతగా జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకర చౌదరి మృతి 
కార్మిక నేత, కమ్యూనిస్ట్‌ ఉద్యమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకర చౌదరి (96) ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మృతి చెందారు. నూరు సంవత్సరాల కమ్యూనిస్ట్‌ ఉద్యమంలో 80 ఏళ్లు ప్రభాకర చౌదరి ఉద్యమనేతగా ఉన్నారు. 1952లో రాజమండ్రి మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1967లో కూడా గెలిచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏడు దశాబ్దాల పాటు ప్రజల పక్షాన అవిశ్రాంత పోరాటం సాగించారు. ఆయన మృతి కమ్యూనిస్ట్‌ ఉద్యమానికి తీరని లోటని పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.

చదవండి: కరోనా టెస్టుల్లో రికార్డు   
నిన్ను నమ్మం బాబూ..

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు