నాగసులోచనా నన్ను క్షమించు..!.. కాలు కింద పెట్టడానికీ ఇబ్బందిగా ఉంది

13 Apr, 2022 07:26 IST|Sakshi
రాజశేఖర్‌శెట్టి (ఫైల్‌)  

సాక్షి, హిందూపురం: నాగసులోచనా..నన్ను క్షమించు..! నా ఆరోగ్య విషయంలో ఎన్నో ఆస్పత్రులు తిప్పావు. వెన్ను నొప్పి తగ్గలేదు. కూర్చోడానికి, కాలు కింద పెట్టడానికీ ఇబ్బందిగా ఉంది.. బతికి ఉండి పదే పదే డాక్టర్ల వద్దకు వెళ్లలేను.. నేను బాధపడుతూ నిన్ను మరింత బాధపెట్టలేను..నీకు భారమైపోతాను.. ఇలాంటి జబ్బు ఏ ఒక్కరికీ రాకూడదు.. అందుకే రెండు నెలల క్రితమే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా.. నన్ను క్షమించు..! అంటూ తన భార్యకు విశ్రాంత తహసీల్దార్‌ రాజశేఖర్‌శెట్టి నోట్‌ రాసి,  తహసీల్దార్‌ కార్యాలయం వెనుకవైపున పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది.  

హిందూపురం కంసాలిపేటలో నివాసం ఉంటున్న రాజశేఖర్‌ శెట్టి (70) రెవెన్యూశాఖలో వివిధ హోదాల్లో లేపాక్షి, హిందూపురం, మడకశిర, అమరాపురం తదితర ప్రాంతాల్లో పనిచేశాడు. పదేళ్ల క్రితం తహసీల్దార్‌గా ఉద్యోగ విరమణ చేశాడు. దీర్ఘకాలికంగా షుగరు, బ్యాక్‌బోన్, కడుపునొప్పి తదితర సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నాడు. అయినా ఫలితంలేక పోయింది. అవసాన దశలో తాను అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబ సభ్యులకు భారం కాకూడదని, బెడ్‌  రెస్ట్‌లో పడితే తన భార్యకు మరింత భారమవుతాననుకున్నాడు.

చదవండి: (దారుణం: ఒక ఇంట్లో రెండేళ్లపాప నాన్నను ఇంకెపుడు చూడలేదు.. మరో ఇంట్లో)

జీవితంపై విరక్తి చెంది సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన ప్రజలు, అధికారులు రాజశేఖర్‌శెట్టి మృతి చెందినట్లు గుర్తించి,  వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ఇస్మాయిల్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య నాగసులోచన ఉన్నారు. కుమార్తె వివాహమై కర్ణాటక రాష్ట్రం కోలార్‌లో ఉంటోంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.  

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.

ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001

మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు