బీడు భూములకు జలకళ

26 Apr, 2021 03:11 IST|Sakshi
కర్నూలు జిల్లాలో జలకళ బోరు వద్ద మహిళా రైతు ఆనందం

వైఎస్సార్‌ జలకళ పథకంలో వేగం పుంజుకున్న ఉచిత బోర్ల తవ్వకాలు

6 నెలల్లో  దాదాపు 20 వేల ఎకరాలకు కొత్తగా నీటి సౌకర్యం

నిత్యం 50 నుంచి 70 వరకు బోర్ల తవ్వకం

అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 1,191 బోర్లు

సాక్షి, అమరావతి/కర్నూలు (అగ్రికల్చర్‌): వైఎస్సార్‌ జలకళ పథకం అమలుతో రాష్ట్రంలోని బీడు, మెట్ట భూముల్లో జల సిరులు వెల్లివిరుస్తున్నాయి. 2020 సెప్టెంబర్‌ 28న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించగా.. 6 నెలల వ్యవధిలోనే కొత్తగా 20 వేల ఎకరాలకు నీటి సౌకర్యం కలిగింది. ఇప్పటివరకు 4,223 వ్యవసాయ బోర్ల తవ్వకాలు పూర్తయ్యాయి. నెల రోజుల క్రితం వరకు గ్రామాల్లో వ్యవసాయ భూముల్లో ఏదో ఒక పంట ఉండటంతో పనులు కాస్త మందకొడిగా సాగినా.. ఇప్పుడు నిత్యం 50 నుంచి 70 వరకు బోర్ల తవ్వకాలు కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో వీటి తవ్వకాల్లో మరింత వేగం పుంజుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

రైతులకు భారం లేకుండా..
వైఎస్సార్‌ జలకళ పథకం అమల్లోకి రాకముందు బోర్లు వేయించుకుని, విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకొని, మోటారు బిగించుకోవడం అనేది చిన్న, సన్నకారు రైతులకు తలకు మించిన భారంగా ఉండేది. బోరు వేసినా నీళ్లు పడకపోతే.. ఇంకో బోరు వేయడం.. అదీ ఫలించకపోతే మరో బోరు వేయడం వల్ల వేలాది మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వైఎస్సార్‌ జలకళ పథకం అమల్లోకి వచ్చాక అలాంటి ఇబ్బందులకు, నష్టాలకు చెక్‌ పడింది. బోరు తవ్వకంతో పాటు పంపుసెట్‌ ఏర్పాటు వంటివి కూడా ప్రభుత్వం ఉచితంగానే అందజేస్తోంది. తవ్వకం పూర్తయిన చోట విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడం, మోటార్లు బిగించడంపై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

82 నియోజకవర్గాల్లో వేగంగా.. 
ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వసతి తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ పథకానికి రైతుల నుంచి విశేష స్పందన వస్తోంది. 82 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పదికి మించి బోర్ల తవ్వకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ పరిధిలో 253 బోర్ల తవ్వకాలు పూర్తవగా.. కర్నూలు జిల్లా బనగానపల్లె, ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గాల్లో 200 చొప్పున బోర్ల తవ్వకాలు జరిగాయి. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 1,191 బోర్ల తవ్వకాలు పూర్తయ్యాయి. 

నాలుగేళ్లలో రెండు లక్షల బోర్లు
గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వచ్చే నాలుగేళ్లలో రెండు లక్షల వ్యవసాయ బోర్ల తవ్వకం లక్ష్యంగా నిర్ణయించారు. వీఆర్వో స్థాయిలోనే 93,812 దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేసి.. వాటిని ఆమోదించారు. వాటిలో జియాలజిస్ట్‌ సర్వే పూర్తయిన 7,892 బోర్ల తవ్వకానికి ఇప్పటికే అన్నిరకాల అనుమతులు మంజూరయ్యాయి.

వాల్టా చట్టానికి మార్పులు
వాల్టా చట్టం నిబంధనల కారణంగా ఈ పథకం ద్వారా రైతులకు ఉచితంగా బోర్లు తవ్వకానికి ఆటంకాలు ఎదురు కావడంతో నిపుణుల అభిప్రాయాలకు అనుగుణంగా వాల్టా చట్టాన్ని సవరించేందుకు చర్యలు చేపట్టాం. ఈ వేసవిలో ఎక్కువ సంఖ్యలో బోర్ల తవ్వకానికి చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. బోరు తవ్వకానికి ముందే లబ్ధిదారుని భూమిని జియాలజిస్ట్‌ ద్వారా సర్వే చేయించిన అనంతరమే తవ్వకం ప్రారంభిస్తుండటంతో 81 శాతం బోరు తవ్వకాలు సక్సెస్‌ అవుతున్నట్టు క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు అందుతున్నాయి. 
– గిరిజా శంకర్, కమిషనర్, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ

వైఎస్సార్‌ జలకళ ఆనందం నింపింది 
మాకు 4.50 ఎకరాల మెట్ట భూమి ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుండక బోరు వేయించలేకపోయాను. మా కోరికను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీర్చారు. ఎలాంటి రికమండేషన్లు లేకుండానే గత నెలలో బోరు వేశారు. నీరు సమృద్ధిగా పడింది. వైఎస్సార్‌ జలకళ మా కుటుంబంలో ఆనందాన్ని నింపింది. 
– కె.లక్ష్మయ్య, ఇందిరేశ్వరం, ఆత్మకూరు మండలం, కర్నూలు జిల్లా  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు