వ్యవసాయానికి మినహాయింపు

9 May, 2021 04:01 IST|Sakshi

కర్ఫ్యూ నుంచి సడలింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: కర్ఫ్యూ నుంచి వ్యవసాయ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మినహాయింపునిచ్చింది. ఈ మేరకు పలు మార్గదర్శకాలతో వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన ఉద్యాన, పశుసంవర్థక, మత్స్య, డెయిరీ శాఖల పరిధిలో జరిగే కార్యకలాపాలకు కూడా కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలతో పాటు పనిముట్లు, యంత్ర పరికరాలను తరలించే వారికి ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల తరలింపు, క్రయవిక్రయాలకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక పాస్‌లు జారీ చేయాలని సూచించారు.

వ్యవసాయ సంబంధిత షాపులు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు తెరిచి ఉంచవచ్చని పేర్కొన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ కోసం ఈ నెల 17 నుంచి సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయబోతున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే వేరుశనగ విత్తన సేకరణ 91 శాతం పూర్తయ్యిందని తెలిపారు. వేలిముద్రల ద్వారా కాకుండా ఓటీపీ విధానంలో విత్తనాలు కావాల్సిన రైతుల వివరాలను నమోదు చేసేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ నిర్మాణం జోరుగా సాగుతోందని, వాటి నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. మార్కెట్‌ యార్డుల్లో కార్యకలాపాలకు ఆటంకం కలగకూడదని పేర్కొన్నారు. రైతు బజార్లలో నో మాస్క్, నో ఎంట్రీ బోర్డులు పెట్టి.. భౌతిక దూరం పాటిస్తూ అమ్మకాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా మొబైల్‌ రైతు బజార్లు ఏర్పాటు చేసి వినియోగదారులు, రైతులు నష్టపోకుండా చూడాలని సూచించారు.   

మరిన్ని వార్తలు