మధుమేహం, నొప్పుల మాత్రల అత్యధిక వినియోగం

8 May, 2022 05:17 IST|Sakshi

2021–22లో ప్రభుత్వాస్పత్రుల్లో 18.10 కోట్ల మధుమేహం మాత్రల వినియోగం

17.65 కోట్ల నొప్పుల నివారణ మందులు

2020–21తో పోలిస్తే 62.43 లక్షల మేర తగ్గిన పారాసిటమాల్‌ మాత్రల వాడకం

అవసరానికి తగ్గట్టుగా పుష్కలంగా మందుల సరఫరా

ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో 480 రకాల మందులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జంటజబ్బులు మధుమేహం, రక్తపోటు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వినియోగిస్తున్న మందులే ఉదాహరణగా నిలుస్తున్నాయి. 2021–22లో మధుమేహ వ్యాధిగ్రస్తులు వాడే మెట్‌ఫార్మిన్‌ మాత్రలు ఏకంగా 18.10 కోట్లు వినియోగించారు. రక్తపోటు బాధితులు వాడే అటెనోలాల్‌ 10.72 కోట్లు, ఆమ్లోడిపైన్‌ 9.45 కోట్లు చొప్పున వినియోగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

అటెనోలాల్‌ మాత్రల వినియోగం 2020–21తో పోలిస్తే 4.15 కోట్ల మేర పెరిగింది. ఇవి కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వినియోగమైనవి మాత్రమే. ఇక ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్‌ షాపుల్లో వినియోగించిన వారు ఉంటారు. కరోనా వైరస్‌ సోకిన కొందరిలో వైరస్‌ ప్యాంక్రియాస్‌ (క్లోమం)పై దాడిచేయడం, చికిత్స సమయంలో అధిక మోతాదులో స్టెరాయిడ్స్‌ వాడటం కారణంగా బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ పెరుగుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మధుమేహం మాత్రల వినియోగం పెరగడానికి మారుతున్న జీవనశైలికి తోడు కరోనా కూడా ఓ కారణం అయి ఉండొచ్చని వారు విశ్లేషిస్తున్నారు.  

అవసరానికి తగ్గట్టుగా 
2021–22లో ప్రభుత్వాస్పత్రులకు మందులు, సర్జికల్స్‌ సరఫరాకు ప్రభుత్వం రూ.410 కోట్లు ఖర్చు చేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచింది. డబ్ల్యూహెచ్‌వో, గుడ్‌ మాన్యుఫ్యాక్ఛరింగ్‌ ప్రాక్టీస్‌ (జీఎంపీ) నిబంధనలకు లోబడి 480 రకాల మందులు ఆస్పత్రుల్లో ఉంటున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో 229 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉండేవి.

రెండో స్థానంలో పెయిన్‌ కిల్లర్‌ మాత్రలు
ప్రభుత్వాస్పత్రుల్లో మధుమేహం మాత్రల వినియోగం అనంతరం రెండో స్థానంలో పెయిన్‌ కిల్లర్‌ మాత్రలు నిలిచాయి. నొప్పి నివారణకు వాడే  డైక్లోఫినాక్‌ మాత్రలు 17.65 కోట్లు వినియోగించారు. 2020–21లో మూడోస్థానంలో ఉన్న ఈ మాత్రల వినియోగం 2021–22లో రెండోస్థానానికి పెరిగింది.

అదేవిధంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చిన్నపాటి జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు సూచనలున్నా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పారాసిట్మల్‌ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గడిచిన రెండేళ్లలో ఈ మాత్రలకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. అయితే కరోనా తొలిదశ వ్యాప్తితో పోలిస్తే రెండోదశలో పారాసిట్మల్‌ మాత్రల వినియోగం ప్రభుత్వాస్పత్రుల్లో కొంతమేర తగ్గింది. 2020–21లో 18 కోట్ల మాత్రలు వినియోగించగా... 2021–22లో 16.78 కోట్లు వినియోగించారు. 

మరిన్ని వార్తలు