కర్ఫ్యూ నుంచి శ్రీవారి భక్తులకు మినహాయింపు

6 May, 2021 05:17 IST|Sakshi
నిర్మానుష్యంగా శ్రీవారి ఆలయం ముందుభాగం

దర్శన టికెట్లున్న భక్తులకు అనుమతి 

కర్ఫ్యూ నిబంధనల అమలు 

తగ్గిన భక్తులు.. నిర్మానుష్యంగా తిరుమల 

తిరుమల: కరోనా నియంత్రణలో భాగంగా బుధవారం నుంచి రాష్ట్రంలో మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఆన్‌లైన్‌లో రూ.300 టికెట్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు వీలుగా మినహాయింపు ఇచ్చినట్లు టీటీడీ ఉన్నతాధికారులు తెలిపారు. దర్శన టికెట్లున్న భక్తులు తిరుపతి చేరుకుంటే ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమల వచ్చి కరోనా నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవచ్చని చెప్పారు. దూరప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వచ్చే భక్తులు దర్శన టికెట్లను చూపి తిరుమలకు రావచ్చని తెలిపారు.

భక్తులు లేక బోసిపోయిన క్యూలైన్లు  

తిరుమలలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్‌ నిబంధనల్ని అనంతరం కర్ఫ్యూ నిబంధనల్ని పోలీసు అధికారులు అమలు చేస్తున్నారు. శ్రీవారిని మంగళవారం అతితక్కువ సంఖ్యలో 4,723 మంది భక్తులు దర్శించుకున్నారు. 2,669 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.39 లక్షలు లభించింది. బుధవారం కూడా దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం మే నెలకు టీటీడీ ఆన్‌లైన్‌లో రోజుకు 15 వేల వంతున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఇస్తుండగా అందులో సగం మంది కూడా స్వామి దర్శనానికి రాలేకపోతున్నారు.

దర్శన టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఈ సంవత్సరం చివరివరకు ఎప్పుడైనా  శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. ఆలయంతోపాటు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ల వద్ద భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని సూచించే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. భక్తులు మాసు్కలు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, శానిటైజేషన్‌ తప్పనిసరిగా చేసుకోవాలని భక్తులకు మైకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు