రైతు ఇంట ప్రకృతి పంట.. విస్తరిస్తున్న ప్రకృతి వ్యవసాయం

11 Feb, 2023 12:30 IST|Sakshi

ఆరేళ్లలో 33వేల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం

తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు-ఆరోగ్యకర ఉత్పత్తులు

మార్కెట్‌లో డిమాండ్‌

157 పంచాయతీల్లో పూర్తిగా ప్రకృతి సేద్యం

రాజాం(విజయనగరం జిల్లా): పెరుగుతున్న జనాభా వల్ల ఆహార ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగింది. మార్కెట్‌లో ఆహారకొరతను తీర్చేందుకు... అధిక దిగుబడుల సాధనకు రైతులు రసాయనిక ఎరువుల వినియోగాన్ని అమాంతం పెంచారు. ఫలితంగా ఆహార ఉత్పత్తులు కషితమవుతున్నాయి. ప్రమాదకరంగా మారి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితుల నుంచి మానవాళిని రక్షించేందుకు, ఆరోగ్యకర పంటలను ఉత్పత్తిచేసేందుకు వ్యవసాయశాఖ అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయం ప్రస్తుతం సత్ఫలితాలిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కారణంగా ఇటీవల కాలంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఆరోగ్యకర ఆహార ఉత్పత్తుల ఎగుమతికి ఆస్కా రం కలుగుతోంది. రైతులకు తక్కువ పెట్టుబడితోనే ఆదాయం సమకూరుతోంది.   

33 వేల ఎకరాల్లో...  
జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం 2.20 లక్షల హెక్టార్లు కాగా, ఇందులో 33 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో కేవలం 10 పంచాయతీల్లో, పదిహేను ఎకరాల్లో ప్రారంభమైన సాగు 2022వ సంవత్సరం రబీనాటికి 33 వేలఎకరాలకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా 157 పంచాయతీల్లో ప్రకృతి సేద్యం జరుగుతోంది. 32 వేల మంది రైతులు సాగులో భాగస్వాములయ్యారు. ఖరీఫ్‌లో 90 మెట్రిక్‌ టన్నుల పంట ఉత్పత్తి చేశారు. 390 మంది ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఈ విధానాన్ని అమలుచేసేందుకు రైతులకు సహకరిస్తున్నారు. గ్రామాల్లో నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  

ఆర్‌బీకేల సాయంతో..  
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. పచ్చిరొట్ట విత్తనాలను రాయితీపై పంపిణీ చేస్తోంది. సేంద్రియ, ప్రకృతి సాగును ప్రోత్సహిస్తోంది. పంటల సాగులో సూచనలు, సలహాలు అందిస్తోంది. యంత్ర పరికరాలను సమకూర్చుతోంది. సాగును లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. గ్రామ పంచాయతీల్లో సేకరించిన చెత్తను సేంద్రియ ఎరువులుగా మార్చి రైతులకు రాయితీపై అందిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో వరి, చెరకు, మొక్కజొన్న , మినుములు, పెసర, ఆముదం, నువ్వులు, వేరుశనగ, రాగులు, కొర్రలు, సామలు తదితర పంటలను ప్రకృతి సేద్యంలో రైతులు సాగుచేస్తున్నారు. 

ఎరువుల తయారీ చాలా సులభం 
ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి సేంద్రియ ఎరువు తయారీ చాలా సులభం. ఆవుపేడ, వేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆవుమూత్రం ప్రధానమైన ముడిసరుకులు. వీటిని తగిన మోతాదులో ప్రకృతి వ్యవసాయం అధికారులు, సిబ్బంది సలహాలతో ఒక రోజు వ్యవధిలో ఎరువులు తయారు చేయవచ్చు. అగ్ని అస్త్రం, ఘన, ధ్రవ జీవామృతాలు, భీజామృతాలు, కషాయాలు తయారుచేసి వరి, మొక్కజొన్న, చెరకు వంటి పంటలతో పాటు చిరుధాన్యాలు, కూరగాయల పంటల్లో వినియోగించవచ్చు. వీటి వలన పంటలో వైవిధ్యం కనిపించడంతో పాటు పంటపొలాలు సారవంతంగా మారి నేలల్లో ఆర్గాన్, కార్బన్‌ ఉత్పత్తులు పెరుగుతాయి. వీటి ఫలితంగా వచ్చే దిగుబడి ప్రతీ మనిషికి ఆరోగ్యంగా ఉండడంతో పాటు అనేక పోషకాలు కలిగిఉంటాయి. 

మంచి ఫలసాయం
మేము  కూరగాయల పంటలకు ఎక్కువుగా సేంద్రియ ఎరువు, జీవామృతాలు వినియోగిస్తున్నాం. మంచి దిగుబడి వస్తుంది. ఈ పంటలు స్థానికంగానే అమ్ముడవుతున్నాయి.  
– పొగిరి అన్నంనాయుడు, మామిడిపల్లి, సంతకవిటి మండలం

ఎరువుల వినియోగాన్ని తగ్గించాం 
వరి, మొక్కజొన్న పంటకు గతంలో ఎక్కువుగా యూరియా, డీఏపీలు వినియోగించేవాళ్లం. ఇప్పుడు పశువుల గెత్తం, ఆవు పేడ, కషాయాలు, పచ్చిరొట్ట ఎరువులు వినియోగిస్తున్నాం. పంటలో చీడపీడలు తగ్గి, దిగుబడి పెరుగుతోంది.  
– టి.అప్పలనాయుడు, లక్ష్మీపురం, రాజాం మండలం 

మరిన్ని వార్తలు