ఏపీలో పులులు పెరుగుతున్నాయ్‌!

19 Apr, 2021 04:09 IST|Sakshi

నాలుగేళ్లలో 46 నుంచి 63కి పెరిగిన పులుల సంఖ్య

విస్తరిస్తున్న శ్రీశైలం పులుల కారిడార్‌

వైఎస్సార్, చిత్తూరు అడవుల్లోనూ పులుల సంచారం

కొనసాగుతున్న వార్షిక గణన.. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం

సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్‌–శ్రీశైలం అభయారణ్యంలో పులుల కారిడార్‌ విస్తరిస్తోంది. నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకూ పులుల సంచారం ఉన్నట్టు అటవీ శాఖ గుర్తించింది. ఈ అభయారణ్యంలో గతంలో పులులు తిరిగే ప్రాంతం గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల పరిధిలో మాత్రమే ఉండేది. ఆ మూడు జిల్లాల్లోని నల్లమల అడవుల్లోనే పులులు సంచరించేవి. కొన్నేళ్లుగా ఇవి తిరిగే కారిడార్‌ నల్లమల నుంచి వైఎస్సార్, చిత్తూరు జిల్లాల పరిధిలోని శేషాచలం అడవుల వరకూ విస్తరించింది. తరచూ నిర్వహిస్తున్న పులుల గణనలో ఈ విషయం స్పష్టమైంది.

అభయారణ్యం 3,727 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉండగా.. 2,444 చదరపు కిలోమీటర్లు కోర్‌ ఏరియా (కేంద్రీకృత ప్రాంతం)గా ఉంది. గతంలో అభయారణ్యాన్ని మూడు బ్లాకులుగా విభజించారు. పులుల కారిడార్‌ పెరుగుతుండటంతో.. కారిడార్‌ ఏరియాగా నాలుగో బ్లాక్‌ ఏర్పాటు చేశారు. ఈ బ్లాకులో రెండేళ్ల క్రితం కొత్తగా ఆరు పులులు కనిపించగా.. గతేడాది మరో మూడు కనిపించాయి. అటవీ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం అభయారణ్యం పరిధిలో మొత్తం 63 పులులున్నాయి. నాలుగేళ్ల క్రితం ఈ సంఖ్య 46 మాత్రమే. ఏటా పులుల సంఖ్య పెరుగుతుండగా.. ఈ ఏడాది కూడా పెరిగే అవకాశం ఉందని అటవీ శాఖాధికారులు భావిస్తున్నారు.

లక్షల ఫొటోలను విశ్లేషించి..
జాతీయ స్థాయిలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే పులుల గణన రాష్ట్రాల్లో మాత్రం ఏటా జరుగుతుంది. ప్రస్తుతం అభయారణ్యంలో రాష్ట్ర అటవీ శాఖ వార్షిక గణన నిర్వహిస్తోంది. నాలుగు బ్లాకుల్లోని ఆత్మకూరు, మార్కాపురం, నంద్యాల, గిద్దలూరు, రాజంపేట, ప్రొద్దుటూరు, కడప అటవీ డివిజన్లలో 597 అధునాతన మోషన్‌ సెన్సార్‌ కెమెరాలు అమర్చారు. ప్రతి 4 చదరపు కిలోమీటర్లకు రెండు చొప్పున కెమెరాలు పెట్టారు. అడవిలో పులులు వెళ్లే ప్రధాన దారుల్లో రెండు వైపులా రెండు జతల కెమెరాల చొప్పున అమర్చారు. ఈ కెమెరాలు వాటి పరిధిలో ఏ వస్తువు కదిలినా ఆటోమేటిక్‌గా ఫొటోలు తీస్తాయి. అలా తీసిన 10 లక్షలకు పైగా ఫొటోలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా విశ్లేషించి జంతువుల జాడను గుర్తిస్తారు.

ప్రధానంగా పులుల సంఖ్య ఆ తర్వాత మిగిలిన జంతువులను లెక్కిస్తారు. ప్రతి పులి చర్మంపై ఉండే చారలు మన చేతి రేఖల్లానే ప్రత్యేకంగా ఉంటాయి. రెండు వైపులా చారలను గుర్తించి వాటి ద్వారా పాత పులులు, కొత్తగా కనిపించిన పులులను లెక్కిస్తారు. ప్రస్తుతం రెండు బ్లాకుల్లో గణన పూర్తవగా మరో బ్లాకులో చివరి దశకు చేరింది. మరో బ్లాకులో త్వరలో ప్రారంభించనున్నారు. ఆగస్ట్‌ నాటికి లెక్కింపు పూర్తి కానుంది. రాష్ట్ర అటవీ శాఖ తీసిన ఫొటోలను నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ) పరిశోధించి విశ్లేషిస్తుంది. వాళ్లు ఖరారు చేసిన తర్వాతే పులుల సంఖ్యను నిర్ధారిస్తారు. 

శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ దేశంలోనే పెద్దది
దేశంలోని టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లలో సాగర్‌–శ్రీశైలం పులుల అభయారణ్యం అతి పెద్దది, ప్రత్యేకమైనది. పులులతోపాటు అనేక జీవరాశుల మనుగడకు ఇక్కడ అవకాశం ఎక్కువ. అందుకే కారిడార్‌ విస్తరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో చేపట్టిన పులుల గణన ఆగస్ట్‌ నాటికి పూర్తవుతుంది. ఈ లెక్కింపు వల్ల పులుల పూర్తి సమాచారం తెలుస్తుంది. ప్రతి పులికి సంబంధించిన ఫొటోలు ఉంటాయి. కాబట్టి వాటిని సంరక్షించడం సులభమవుతుంది.
– ఎన్‌.ప్రతీప్‌కుమార్, అటవీ దళాల అధిపతి

మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం
సాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో పులుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం అమర్చిన కెమెరాలు 50 శాతం కారిడార్‌ను కవర్‌ చేస్తాయి. కాబట్టి పులుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇది పర్యావరణ, జీవావరణ సమతుల్యతకు కీలకం.
– వై.శ్రీనివాసరెడ్డి, కన్జర్వేటర్, టైగర్‌ సర్కిల్‌ ప్రాజెక్ట్, శ్రీశైలం 

మరిన్ని వార్తలు