ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకూ ఆయిల్‌పామ్‌ విస్తరణ 

27 Dec, 2022 05:20 IST|Sakshi

ప్రస్తుతం 236 మండలాల్లో సాగు 

మరో 117 మండలాల్లో విస్తరణ 

కొత్త మండలాలను నోటిఫై చేసిన ప్రభుత్వం 

రైతులకు రూ.617.50 కోట్ల మేర ఆర్థిక చేయూత  

సాక్షి, అమరావతి: నీటి సౌకర్యం గల ప్రతి ప్రాంతంలోనూ ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఉభయ గోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ, కృష్ణా జిల్లాలకే పరిమితమైన ఆయిల్‌పామ్‌ సాగును ఇకపై ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ పరిధిలోని అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ విస్తరించనున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని 17 జిల్లాల పరిధిలో 236 మండలాల్లో ఆయిల్‌పామ్‌ సాగవుతుండగా.. తాజాగా మరో 117 మండలాలను నోటిఫై చేశారు. ఆయిల్‌పామ్‌ సాగులో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 9 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ తోటలు ఉండగా.. ఏపీలో 4.81 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. తాజాగా నోటిఫై చేసిన 117 మండలాల్లో ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆ మండలాల పరిధిలో రానున్న నాలుగేళ్లలో రూ.617.50 కోట్లను రైతులకు ప్రోత్సాహకాల రూపంలో అందజేస్తారు. ఆయిల్‌పామ్‌ మొక్కల కొనుగోలు, అంతర పంటల సాగు, నిర్వహణ, యాంత్రీకరణ కోసం ఈ నిధులను వినియోగిస్తామని వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.మధుసూదనరెడ్డి వెల్లడించారు.  

మరిన్ని వార్తలు