డ్రోన్లతో వెదసాగు సక్సెస్‌

20 Jul, 2023 04:16 IST|Sakshi

ఈ ఖరీఫ్‌లో వంద ఎకరాల్లో ప్రయోగాత్మక సాగు

ఇప్పటికే 217 మంది డ్రోన్‌ పైలట్లకు శిక్షణ 

త్వరలో తిరుపతి, పులివెందులలో డ్రోన్‌ శిక్షణ కేంద్రాలు

సాక్షి ప్రతినిధి, గుంటూరు: వరిసాగులో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టడంలో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ ముందు­కు సాగుతోంది. దేశంలోనే మొదటిసారిగా వ్యవసాయ డ్రోన్ల వినియోగంపై రైతులకు, గ్రామీణ యువతకు అవగాహన కల్పిస్తూ, వ్యవ­సాయంలో రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపు­ను నిజం చేస్తోంది. ఇప్పటివరకు 10 ప్రధా­­న పంటల్లో డ్రోన్లతో పురుగుమందు­లు చల్లడానికి ప్రామాణికాలను తయారుచేసి, శిక్షణ ఇచ్చింది.

ఇప్పుడు ఏకంగా వెదపద్ధతి(విత్తనాలు వెదజల్లడం)లో విత్తనాలు చల్లే ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. మారుతున్న వాతావరణ పరిస్థితు­ల కారణంగా వర్షాలు సకాలంలో పడకపోవడంతో రైతులు సకా­లంలో వరినాట్లు వేయలేకపోతున్నారు. ఖరీఫ్‌ సాగు ఆలస్యం అవుతోంది. దీంతో రైతులు వెదసాగు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వరిసాగులో 21 శాతం వరకు వెదపద్ధతిలోనే జరుగుతున్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

వెదపద్ధతిలో గత ఏడాది 100 ఎకరాల్లో వరి, మినుము, పచ్చి రొట్ట సాగుచేశారు. దుక్కి దున్నిన తరువాత నుంచి అన్ని పంటల్లో డ్రోన్లతో అన్ని రకాల పనులు చేసుకోవచ్చని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతికతను జోడించి డ్రోన్లతో వరి విత్తనాలను వెదజల్లించాలని వర్సిటీ శాస్త్రవేత్తలు నిర్ణయించారు.
 
సమయం, డబ్బు ఆదా 
డ్రోన్లతో వెదపద్ధతిలో తక్కువ విత్తనాలు సరి­­పో­­తాయి. సమయం, డబ్బు ఆదా అవుతాయి. మొదటి ఏడాది ఫలితాలను విశే­్లషించిన తర్వాత వెదపద్ధతిలో విత్తనాల­ను నాట­డం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చ­ని గుర్తించారు. రెండో సంవత్సరం ఫలితా­లు ఆశాజనకంగా వస్తే దుక్కి నుంచి కోత వరకు డ్రోన్లను ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ట్రాక్ట­ర్లు, చేతి­తో చల్లే పద్ధతిలో ఎకరానికి 16 నుంచి 30 కిలోల వరకు విత్తనాలు వినియోగిస్తున్నారు.

అదే డ్రోన్‌ ద్వారా చల్లితే 8 నుంచి 12 కిలోల విత్తనాలు సరిపోతాయి. గత ఏడాది­గా డ్రోన్ల సాయంతో విత్తనాలు చల్లడం, ఎరువులు (యూ­రియా, డీఏపీ) వేయడం, పురుగుమం­దుల పిచికారీలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఎకరం పొలంలో మూడు నిమిషా­ల్లో విత్తనాలు చల్లవచ్చు. 50 కిలోల రసాయని­క ఎరువును ఎనిమిది నిమిషాల్లో చల్లవ­చ్చు.

ఎకరా విత్తనాలు విత్తుకునేందు­కు రూ.­­400 నుంచి రూ.500 ఖర్చవుతుంది. విత్తనాల్లో 25 శాతం ఆదా అవుతాయి. పురుగుమందుల వ్య­యం 25 శాతం తగ్గడమేగాక చల్లే ఖర్చులో రూ.­400 ఆదా అవుతాయి. గత ఏడాది వెదపద్ధతిలో చేసిన సాగు ఆశాజనకమైన ఫలితాల­ను ఇవ్వడంతో ఈ విధానంపై పరిశోధనలను ముమ్మరం చేసింది.

డీజీసీఏ అనుమతితో శిక్షణ 
దేశంలో ఎక్కడా లేనివిధంగా డ్రోన్లను వినియోగించడంతోపాటు డీజీసీఏ అనుమతి తీసు కుని వ్యవసాయ డ్రోన్‌ పైలట్లకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శిక్షణ ఇస్తోంది. వర్సిటీలోని శిక్షణ కేంద్రంలో ఇప్పటివరకు 217 మంది రైతులు, గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి సరి్టఫికెట్లు అందజేసింది. మరో వందమంది వ్యవసాయ పాలిటెక్నిక్‌ విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చింది. తిరుపతి, పులివెందులలో డ్రో¯Œ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

రైతులకు అధునాతన సాంకేతికత  
ఆధునిక వ్యవసాయ విధానాలను రైతులకు అందించేందుకు దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ల ద్వారా వ్యవసాయాన్ని ప్రయోగాత్మంగా చేపట్టి  మంచి ఫలితాలను సాధించాం. వెదపద్ధతిలో వరిసాగు, పురుగుమందులు, ఎరువుల పిచికారీలో మంచి ఫలితాలు వచ్చాయి. మరికొంత సాంకేతికతను రైతులకు అందించేందుకు రోబో టెక్నాలజీపై ప్రయోగాలు చేపట్టాం. అధునాతన సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తెస్తున్నాం.  – డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, వీసీ,  ఎన్జీరంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ  

మరిన్ని వార్తలు