పులిచింతలను పరిశీలించిన నిపుణుల కమిటీ 

12 Aug, 2021 09:16 IST|Sakshi
పులిచింతల ప్రాజెక్టును పరిశీలిస్తున్న అధికారుల బృందం 

23 గేట్లలో సాంకేతికంగా సమస్యలు లేవని నిర్ధారణ

కాంక్రీట్, స్టీల్‌ను పరీక్షలకు పంపాలని నిర్ణయం

పరీక్షల ఫలితాల ఆధారంగా మరోసారి ప్రాజెక్టు పరిశీలన

అనంతరం ప్రాజెక్టు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక 

సాక్షి, అమరావతి/అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు భద్రతపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందుకోసం ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ బుధవారం ప్రాజెక్టును పరిశీలించింది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహానికి ప్రాజెక్టులో నీటినిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఈనెల 5న తెల్లవారుజామున దిగువకు ప్రవాహాన్ని విడుదల చేసేందుకు గేట్లు ఎత్తేటపుడు సాంకేతిక లోపం వల్ల 16వ గేటు ఊడిపోవటం తెలిసిందే. వరద ఉధృతికి కొట్టుకుపోయిన గేటు స్థానంలో రికార్డు సమయంలో స్టాప్‌లాగ్‌ గేటును ఏర్పాటుచేసి ప్రాజెక్టులో నీటినిల్వకు మార్గం సుగమం చేసిన ప్రభుత్వం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటికి ఇబ్బంది లేకుండా చేసింది.

గేటు ఊడిపోవడానికి కారణాలు, ప్రాజెక్టు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన డిజైన్స్‌ సలహాదారు గిరిధర్‌రెడ్డి, రిటైర్డ్‌ సీఈ కె.సత్యనారాయణ, సీడీవో (సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌) సీఈ శ్రీనివాస్‌ సభ్యులుగా, పులిచింతల ఎస్‌ఈ రమేష్‌బాబు కన్వీనర్‌గా నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ బుధవారం పులిచింతల ప్రాజెక్టును పరిశీలించింది. రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు కృష్ణా బోర్డు కమిటీ బుధవారం రావడంతో ఆ కమిటీకి వివరాలను అందించేందుకు ఈఎన్‌సీ నారాయణరెడ్డి అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజైన్స్‌ సలహాదారు గిరిధర్‌రెడ్డి, రిటైర్డ్‌ సీఈ సత్యనారాయణ, సీడీవో సీఈ శ్రీనివాస్, పులిచింతల ఎస్‌ఈ రమేష్‌బాబు బుధవారం పులిచింతల ప్రాజెక్టును పరిశీలించారు. 9వ నంబరు గేటును ట్రయల్‌ రన్‌ వేశారు. 23 గేట్లలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని తేల్చారు. ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయవచ్చని సూచించారు. 

మరోసారి పరిశీలిస్తాం
గేటు ఊడిపోవడానికి దారితీసిన పరిస్థితులపై లోతుగా అధ్యయనం చేశారు. స్పిల్‌ వే కాంక్రీట్, స్టీల్‌ పటిష్టతను తేల్చేందుకు పరీక్షలకు పంపాలని నిర్ణయించారు. పరీక్షల్లో కాంక్రీట్, స్టీల్‌ పటిష్టతను బట్టి.. గేటు ఊడిపోవడానికి కారణాలను అన్వేషించవచ్చునని డిజైన్స్‌ సలహాదారు గిరిధర్‌రెడ్డి చెప్పారు. వరద ఉధృతికి ఊడిపోయిన గేటు పూర్తిగా వంగిపోయిందని.. ఆ గేటు మళ్లీ వినియోగించడానికి పనికిరాదని తేల్చారు. ఆ గేటు స్థానంలో కొత్తది తయారుచేసి అమర్చాలని నిర్ణయించారు. గేట్ల నిర్వహణను మరింత మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. పరీక్షల్లో కాంక్రీట్, స్టీల్‌ పటిష్టత తేలాక ప్రాజెక్టును మరోసారి పరిశీలించి, అధికారులతో సమీక్షించి ప్రాజెక్టు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కమిటీ సభ్యులు చెప్పారు.

మరిన్ని వార్తలు