Penna River: పెన్నాలో అన్ని నీళ్లా?

30 Mar, 2021 05:18 IST|Sakshi

సీడబ్ల్యూసీ తాజా అంచనాలపై నిపుణుల విస్మయం

గతంలో కంటే 165.97 టీఎంసీల లభ్యత పెరిగిందన్న సీడబ్ల్యూసీ 

వర్ష ఛాయ ప్రాంతంలోని పెన్నా బేసిన్‌లో ఆ స్థాయిలో నీటి లభ్యతా?

30 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా లెక్కించడం అశాస్త్రీయం

50 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా లెక్కిస్తేనే కచ్చితమైన లెక్కలు  

సాక్షి, అమరావతి: పెన్నా నదిలో నీటి లభ్యత అంచనాలపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా లెక్కలు చూసి నీటిపారుదల రంగ నిపుణులు నివ్వెరపోతున్నారు. పెన్నా పరీవాహక ప్రాంతం (బేసిన్‌)లో కావాల్సినన్ని నీళ్లున్నాయని సీడబ్ల్యూసీ తేల్చడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వర్ష ఛాయ(రెయిన్‌ షాడో) ప్రాంతంలోని పెన్నా బేసిన్‌లో నీటి లభ్యత అవసరమైన మేరకు లేదని నీటిపారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే సీడబ్ల్యూసీ మాత్రం సమృద్ధిగా నీటి లభ్యత ఉందని తేల్చింది. 1993లో సీడబ్ల్యూసీ అధ్యయనంలో పెన్నాలో 223.19 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేయగా తాజాగా 389.16 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. గతంతో పోల్చితే నీటి లభ్యత 165.97 టీఎంసీలు పెరిగిందని లెక్కగట్టింది.

తాజా అధ్యయనంలో 75 శాతం లభ్యత ఆధారంగా 243.67 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ లెక్కకట్టడంపై నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పెన్నా బేసిన్‌లో 30 ఏళ్లు కాకుండా 50 సంవత్సరాల వరద ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేస్తే కచ్చితమైన లెక్కలు తేలతాయని స్పష్టం చేస్తున్నారు. దేశంలో థార్‌ ఎడారి తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా పెన్నా బేసిన్‌లోనే ఉన్న విషయం తెలిసిందే. అలాంటి బేసిన్‌లో పాతికేళ్ల తర్వాత ఈ నీటి సంవత్సరంలో పెన్నా వరద జలాలు సముద్రంలో కలవడాన్ని పరిగణనలోకి తీసుకున్నా సీడబ్ల్యూసీ తేల్చిన స్థాయిలో లభ్యత ఉండే అవకాశమే లేదని తేల్చి చెబుతున్నారు. 

ఇదీ పెన్నా బేసిన్‌..
రెండు రాష్ట్రాల్లో ప్రవహించే పెన్నా నది కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ జిల్లా నంది పర్వతాల్లో పుట్టి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, వైఎస్సార్‌ కడప, నెల్లూరు జిల్లాల్లో ప్రవహించి నెల్లూరు జిల్లా ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మొత్తం 597 కి.మీ. ప్రవహించే ఈ నదికి జయమంగళి, కుందేరు, సగిలేరు, చిత్రావతి, చెయ్యేరు, పాపాఘ్ని తదితర ఉప నదులున్నాయి. పెన్నా బేసిన్‌ 54,905 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతం. ఈ బేసిన్‌లో సగటున కనిష్టంగా 400 నుంచి గరిష్టంగా 716 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదవుతుంది. వర్ష ఛాయ ప్రాంతంలో ఉన్న పెన్నా బేసిన్‌లో అనావృష్టి, అతివృష్టి పరిస్థితుల వల్ల ఏకరీతిగా వర్షం కురవదు. డ్రైస్పెల్స్‌ (వర్షపాత విరామాలు) కూడా అధికంగా నమోదవుతాయి.

పెన్నా బేసిన్‌లో సీడబ్ల్యూసీ అధ్యయనంలో నీటి లభ్యత వివరాలు 

నీటి లభ్యత పెరిగిందా?
పెన్నా బేసిన్‌లో 1985–2015 మధ్యన 30 ఏళ్లలో వరద ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుని ఇటీవల సీడబ్ల్యూసీ నీటి లభ్యతపై అధ్యయనం చేసింది. బేసిన్‌లో వర్షపాతం వల్ల 1,412.56 టీఎంసీలు (40 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు) నీరు వస్తుందని తేల్చింది. నదిలో 389.16 టీఎంసీల లభ్యత ఉందని లెక్కగట్టింది. 75 శాతం డిపెండబులిటీ పరంగా చూస్తే 243.67 టీఎంసీల నీటి లభ్యత ఉందని తేల్చింది. నిజానికి 1995లో పెన్నా బేసిన్‌లో గరిష్ట వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత ఈ ఏడాదే ఆ స్థాయిలో వర్షపాతం కురిసింది.

1995 తర్వాత ఈ ఏడాదే పెన్నా బ్యారేజీ నుంచి వరద జలాలు సముద్రంలో కలిశాయి. దీన్ని బట్టి చూస్తే పెన్నాలో సీడబ్ల్యూసీ తేల్చిన మేరకు నీటి లభ్యత ఉండే అవకాశమే లేదని నీటిపారుదల నిపుణులు తేల్చి చెబుతున్నారు. బేసిన్‌లో 75 ఏళ్లు లేదా కనీసం 50 ఏళ్లలో నమోదైన వరద ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేసి ఉంటే నీటి లభ్యతపై కచ్చితమైన లెక్కలు తేలే అవకాశం ఉండేదని స్పష్టం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు