గతేడాది ‘స్థానికం’ నోటిఫికేషన్‌ నాటికి ఒక్క కేసే..

25 Jan, 2021 03:27 IST|Sakshi

వాయిదా వేసేనాటికి మూడు కరోనా కేసులే 

కరోనా అంటూ నాడు ‘పంచాయతీ’కి నిమ్మగడ్డ నిరాకరణ.. షెడ్యూలు ఇచ్చీ వెనక్కి 

మార్చి 29 నాటికి ఎన్నికలు సజావుగా పూర్తయ్యేవి.. అప్పటికి 167 కేసులే

తాజాగా ఇప్పుడు నోటిఫికేషన్‌ ఇచ్చే నాటికి సగటున రోజుకు 170కిపైగా కేసులు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ గతేడాది మార్చిలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు జారీ చేసి కూడా కరోనా ఉందంటూ వాయిదా వేయడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా ప్రకటించిన ప్రకారం నాడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఉంటే రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి ప్రభావం ఏమాత్రం లేనప్పుడే పోలింగ్‌ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేదని నిపుణులు పేర్కొంటున్నారు. అప్పటితో పోలిస్తే రాష్ట్రంలో ఇప్పుడే చాలా ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. నాడు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ నాటికి రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క కరోనా కేసు ఉంది. ఇప్పుడు సగటున రోజుకు 170 నుంచి 180 వరకూ నమోదవుతున్నాయి. పైగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. లక్షలాది మంది సిబ్బంది ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. మరి అప్పుడు వాయిదా వేసి ఇప్పుడెందుకు నోటిఫికేషన్‌ ఇచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు ఉద్యోగులు మరోవైపు వైద్యులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా ఈ సమయంలో ఎన్నికలు సరికాదని విన్నవిస్తున్నా మొండిగా వ్యవహరించడం వెనుక కొందరి రహస్య పాత్ర ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

కేసులు లేనప్పుడు వాయిదా వేసి.. 
గత ఏడాది మార్చి 7వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల సమయంతో పోలిస్తే కరోనా పరిస్థితులు ఇప్పుడే ఆందోళనకరంగా ఉన్నాయి. ఏప్రిల్‌లో మర్కజ్‌ యాత్రికులు తిరిగి రావడం, వివిధ రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు పెద్ద ఎత్తున వలస కార్మీకుల రాకతో క్రమంగా పెరిగిపోయాయి. గతేడాది మార్చిలో కరోనా కేసులు లేనప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను మధ్యలోనే వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తాజాగా కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ చెలరేగిన వేళ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవ్వడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 

కరోనా పరిస్థితులు ఇలా
► స్థానిక సంస్థలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ గతేడాది మార్చి 7న విడుదలైంది. ఆ సమయానికి రాష్ట్రంలో నమోదైన కేసులు కేవలం ఒక్కటి మాత్రమే కావడం గమనార్హం.  
► ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తేదీ మార్చి 21 నాటికి రాష్ట్రంలో కేసులు 13 మాత్రమే ఉన్నాయి. తొలిదశ పంచాయతీ ఎన్నికలు మార్చి 27న నిర్వహించనున్నట్లు షెడ్యూలు జారీ చేయగా అప్పటికి 13 పాజిటివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. 
► రెండో దశ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు సమయానికి అంటే మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 3 నాటికి 167 కేసులున్నాయి. అయితే ముందుగా ప్రకటించిన ప్రకారం ఎన్నికలు జరిగి ఉంటే అప్పటికి పోలింగ్‌ ముగిసేది. 
► స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేసిన గత మార్చి 15వతేదీ నాటికి రాష్ట్రంలో నమోదైంది కేవలం 3 కేసులు మాత్రమే. 
► తాజాగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చిన జనవరి 23న రాష్ట్రంలో 172 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ రాష్ట్రంలో సగటున వారానికి 1,260 కరోనా కేసులు నమోదవుతున్నాయి.  

మరిన్ని వార్తలు