పాచిపోయిన చికెన్‌.. పురుగులు పట్టిన స్వీట్‌కార్న్‌

8 Aug, 2020 07:32 IST|Sakshi
శ్రీక్రిష్ణా గ్రాండ్‌ హోటల్‌ను సీజ్‌ చేస్తున్న ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ల బృందం (ఇన్‌ సెట్‌లో) పురుగులు పట్టిన స్వీట్‌కార్న్‌

కదిరి: జిల్లాలోని పలు హోటళ్ల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బూజు పట్టిన ఆహార పదార్థాలు, పాచిన చికెన్‌ ఇతర ఆహార పదార్థాలను ఇప్పటికే అనంతపురం నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా కదిరిలోనూ ఇలాంటి సంఘటనే మళ్లీ పునరావృతం అయింది. పట్టణంలోని శ్రీక్రిష్ణా గ్రాండ్‌ హోటల్‌లో ముందు రోజు మిగిలి పోయిన వంటకాలను తాజాగా స్పెషల్‌ అంటూ పార్శిల్‌ల రూపంలో ప్రజలకు అందజేస్తున్నారు.

దీనిపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంలో శుక్రవారం మున్సిపాలిటీ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల బృందం తనిఖీ చేసింది. వారి తనిఖీల్లో ఆ ఫిర్యాదు నిజమని తేలింది. ముందురోజు వండిన చికెన్‌ను పార్సిళ్ల రూపంలో అందజేసేందుకు సిద్ధం చేయడాన్ని వారు గుర్తించారు. అలాగే స్వీట్‌ కార్న్‌ డబ్బా తెరిస్తే బూజుపట్టి అందులో తెల్లని పురుగులు బయటకొచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడున్న హోటల్‌ సిబ్బంది ఒక్కరు కూడా మాస్కులు గానీ, చేతికి గ్లౌజులు గానీ, తలకు క్యాపులు గానీ ధరించకపోవడాన్ని కూడా అధికారులు గుర్తించారు. అనంతరం ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ రమణ మీడియాతో మాట్లాడుతూ తమకు అందిన ఫిర్యాదు మేరకు హోటల్‌ను తనిఖీ చేస్తే పాచిపట్టిన, బూజుపట్టిన వంటకాలు తమకు కనిపించాయని , అందుకే ఈ హోటల్‌ను తక్షణం సీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు