మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు

12 Mar, 2021 13:49 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శిస్తున్న మంత్రి కన్నబాబు

సాక్షి, కాకినాడ: టైకి ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు వ్యవసాయ శాఖా మంత్రి మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ప్రభుత్వం తరఫున 10 లక్షలు, కంపెనీ తరఫున 40 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ప్రమాదంలో గాయపడిన వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం లక్ష, కంపెనీ రూ. 3 లక్షలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇక మృతి చెందిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇండ్ల స్థలం(ప్రభుత్వం తరఫున) ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బాధిత కుటుంబాల పక్షాన పరిశ్రమ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమైనట్లు వెల్లడించారు. కాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ సర్పవరం ఆటోనగర్‌ వద్ద బల్క్‌డ్రగ్స్‌ తయారుచేసే టైకీ పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించిన విషయం విదితమే.

                                         పేలుడుకు దెబ్బతిన్న గ్యాస్‌లైన్‌ రియాక్టర్‌
ఈ ప్రమాదంలో సూపర్‌వైజర్లు కాకర్ల సుబ్రహ్మణ్యం(31), తోటకూర వెంకటరమణ(37) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలియగానే మంత్రి కురసాల కన్నబాబు, కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, ఇతర శాఖల అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, అప్పటివరకు మూసివేయాలని మంత్రి ఆదేశించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఇదే పరిశ్రమలో గతంలో గ్యాస్‌ లీకేజీ కలవరం రేపింది. అప్పట్లో అధికారులు విచారణ జరిపి లీకేజీ జరగలేదని ప్రకటించారు. కాగా, ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు.

చదవండి: సర్పవరం టైకీ పరిశ్రమలో ప్రమాదం: ఇద్దరు మృతి

మరిన్ని వార్తలు