బయటపడిన మార్గదర్శి మోసాలు

18 Nov, 2022 03:22 IST|Sakshi

చర్యలు తీసుకోవాలని చిట్స్‌ డిప్యూటీ రిజిస్ట్రార్లకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశాలు

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీలో మోసాలు బట్టబయలయ్యాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) బృందాలు మూడు రోజులపాటు చేసిన తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణయ్యాయి. రాష్ట్రంలోని పలు చిట్‌ఫండ్‌ కంపెనీల్లో అధికారులు మూడు విడతలుగా తనిఖీలు చేశారు. మూడో విడతలో మార్గదర్శి సంస్థల్లో మూడురోజులు తనిఖీలు నిర్వహించారు.

1982 చిట్‌ఫండ్‌ చట్టానికి విరుద్ధంగా ఉన్న రికార్డులు, మెటీరియల్‌ను అధికారులు సీజ్‌ చేశారు. చిట్ల రూపంలో కట్టిన నిధులను మళ్లించడం, జీఎస్టీ ఎగవేయడం, కంపెనీ పాడిన చిట్‌లకు గ్యారెంటీ చూపకపోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించారు. గురువారం నిర్వహించిన తనిఖీల్లో వాటిపై పూర్తి ఆధారాలను సేకరించారు. ఈ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల చిట్స్‌ డిప్యూటీ రిజిస్టార్లను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ అండ్‌ కమిషనర్‌ రామకృష్ణ ఆదేశించారు.

కాగా తనిఖీల సందర్భంగా మార్గదర్శి అన్ని బ్రాంచీలలోనూ తమ గ్రూపు సంస్థలకు చెందిన మీడియా ప్రతినిధులను మోహరించారు. సాధారణంగా ఇలా దాడులు జరిగే సమయంలో అధికారులే వీడియో సాక్ష్యాలను చిత్రీకరిస్తుంటారు. కానీ మార్గదర్శి బ్రాంచీలలో ఈ మీడియా ప్రతినిధులు కూడా వీడియోలు తీస్తూ అధికారులను బెదిరించే ధోరణిలో హల్‌చల్‌ చేసినట్లు తెలిసింది.

అంతేకాదు తనిఖీల సందర్భంగా జరిపే పంచనామా పత్రాలపై సంతకాలు చేయడానికి కూడా మార్గదర్శి సిబ్బంది నిరాకరించారని అధికారులు తెలిపారు. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే వారు అలా సంతకాలకు నిరాకరించి ఉంటారని, తమకు తెలియకుండానే పంచనామా తతంగాన్ని పూర్తి చేశారని ఆరోపించేందుకే అలా చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.  

మరిన్ని వార్తలు