‘అమూల్‌’పై మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు 

6 Jul, 2021 04:15 IST|Sakshi

సాక్షి, అమరావతి: అమూల్‌తో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా పాల సేకరణ, మార్కెటింగ్‌ తదితరాలపై ఎలాంటి ఖర్చు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఇదే సమయంలో ఈ మొత్తం వ్యవహారంలో తమ వాదనలు వినాలంటూ పాల రైతులు దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్లపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ కేసులో అమూల్, నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు దాఖలు చేసిన కౌంటర్లకు తిరుగు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్‌ రఘురామకృష్ణరాజు తరఫు సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణ గడువు కోరారు.

ఇందుకూ అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీడీడీసీఎఫ్‌ ఆస్తుల బదలాయింపుపై మంత్రి మండలి తీర్మానాన్ని ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతో పాటు, అమూల్, ఏపీడీడీసీఎఫ్‌ల మధ్య కుదిరిన పరస్పర అవగాహన ఒప్పందం తాలూకు జీవో 25ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు