Jagananna Vidya Deevena: ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ గడువు పెంపు

2 Oct, 2022 05:19 IST|Sakshi

మరింత మందికి మేలు చేసేందుకు 30 వరకు పెంచిన ప్రభుత్వం  

సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు హర్షవర్ధన్‌

సాక్షి, అమరావతి: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు హర్షవర్ధన్‌ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన శనివారం వివరాలు వెల్లడించారు. పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి పేరొందిన యూనివర్సిటీల్లో పెద్ద చదువులు అభ్యసించాలన్న గొప్ప లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ(అగ్రవర్ణ పేదలు), దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇందుకు దరఖాస్తు చేసుకునేలా గత నెల 30 వరకు ప్రభుత్వం గడువిచ్చిందన్నారు. ఇప్పటి వరకు 392 దరఖాస్తులొచ్చాయని, అయితే ఈ పథకంలో మరింత మందికి మేలు చేసే లక్ష్యంతో మరో నెల రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఒకటి నుంచి 200 క్యూఎస్‌ ర్యాంకులు కలిగిన విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఇది వర్తిస్తుందని తెలిపారు. ఒకటి నుంచి వంద క్యూఎస్‌ ర్యాంకింగ్‌ కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్న విద్యార్థులకు ఫీజు రూ.కోటి అయినా నూరు శాతం రీయింబర్స్‌మెంట్, క్యూఎస్‌ ర్యాంకుల్లో 101 నుంచి 200లోపు కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే రూ.50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేసేలా పథకాన్ని రూపొందించినట్టు వివరించారు.

రూ.8 లక్షల్లోపు వార్షికాదాయం కలిగిన వారు ఈ పథకానికి అర్హులని చెప్పారు. ఈ పథకంలో ఉన్న నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ఎంతమందికైనా ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ ఇస్తుందని హర్షవర్ధన్‌ వివరించారు. 

>
మరిన్ని వార్తలు