మన్యం.. మసాలా

9 Aug, 2020 04:37 IST|Sakshi
సిల్వర్‌ ఓక్‌ చెట్లకు దట్టంగా అల్లుకున్న మిరియాల పాదులు

విశాఖ ఏజెన్సీలో విస్తారంగా సుగంధ ద్రవ్యాల సాగు

పంట విస్తీర్ణం పెంపుపై ఉద్యాన శాఖ దృష్టి

రైతులకు ఉచితంగా మొక్కల పంపిణీ

సాగుకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం రాయితీలు

సాక్షి, విశాఖపట్నం: నాణ్యమైన కాఫీ గింజలకు, సహజసిద్ధమైన తేనెకు దేశ ప్రసిద్ధిగాంచిన విశాఖ మన్యం ఇప్పుడు సుగంధ ద్రవ్యాల సాగులోనూ పేరుగడిస్తోంది. సుగంధ ద్రవ్యాలు.. అల్లం, పసుపు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వంటల్లోనే కాకుండా కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి కషాయాలుగానూ ఉపయోగపడుతున్నాయి. దీంతో వీటికి మరింత డిమాండ్‌ పెరిగింది. సుగంధ ద్రవ్యాలకు పేరొందిన కేరళలో కంటే మన్యంలో సేంద్రీయ పద్ధతిలో పండించిన నాణ్యమైన సరుకు లభ్యమవుతోంది. ఇక్కడ 11 మండలాల్లో ఉన్న ఎర్రగరప నేలలు సాగుకు ఎంతో అనుకూలం.

అల్లం
► మన్యంలో 300 ఎకరాల్లో అల్లం సాగవుతోంది. 
► దేశవాళీ నర్సీపట్నం రకం అల్లం దిగుబడి ఎకరాకు రెండు టన్నులే ఉంటోంది. దీంతో మహిమ, నడియా రకాలను ఉద్యాన శాఖ ప్రవేశపెట్టింది. ఎకరాకు ఆరు టన్నుల దిగుబడి, రూ.5 లక్షల వరకు ఆదాయం లభిస్తున్నాయి.

పసుపు
► మన్యం పసుపు ధర ఈ ఏడాది టన్ను రూ.9 వేలు పలికింది. 
► కస్తూరి రకం పసుపును కుంకుమ తయారీకి ఉపయోగిస్తున్నారు. 
► పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ‘పసుపు ప్రాజెక్టు’ను ఇటీవలే ప్రారంభించింది. 
► 20,552 ఎకరాల్లో ఉన్న పసుపు సాగును ఐదేళ్లలో మరో పది వేల ఎకరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.100 కోట్లు కేటాయించాయి.

దాల్చిన చెక్క
వంద ఎకరాల్లో మొక్కలు సాగవుతున్నాయి. 
లవంగాలు
ఈ ఏడాదే 80 ఎకరాల్లో లవంగాల మొక్కలను నాటారు. 

మిరియాలు
► 27,182 ఎకరాల్లో సాగు ఉంది. కాఫీ తోటల నీడ కోసం పెంచే సిల్వర్‌ ఓక్‌ చెట్లపైకి మిరియాల పాదులను పెంచుతారు. ఇలా అంతర పంటగా పన్నియూరు–1 రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. 
► ఎకరాకు వంద కిలోల వరకు దిగుబడి, రూ.15 వేల వరకు అదనపు ఆదాయం లభిస్తున్నాయి.
జాజికాయ
► మన్యంలో ఈ ఏడాదే 80 ఎకరాల్లో రైతులు జాజికాయ మొక్కలు నాటారు. పదేళ్ల చెట్లు అయితే ఎకరాకు రూ.50 వేలకుపైగా ఆదాయం వస్తుంది. 

రైతులకు లాభం
సుగంధ ద్రవ్యాల సాగులో సస్యరక్షణ చర్యలు చేపడితే ఎకరానికి ఏటా రూ.5 లక్షల వరకు పొందొచ్చు. మండల వ్యవసాయాధికారులు, గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు రైతులకు సలహాలు ఇస్తున్నారు. ప్రభుత్వం పసుపు, అల్లం రైతులకు హెక్టారుకు రూ.12 వేలు చొప్పున, మిరియాలకు రూ.8 వేలు, దాల్చిన చెక్క, జాజికాయ, లవంగాల రైతులకు రూ.20 వేల చొప్పున రాయితీ ఇస్తోంది. 
    – కె.గోపీకుమార్, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు, విశాఖ జిల్లా 

ప్రభుత్వమే ఉచితంగా ఇస్తోంది
సుగంధ ద్రవ్యాల మొక్కలను వివిధ రాష్ట్రాల నుంచి వ్యయప్రయాసలకోర్చి తెచ్చేవాడిని. ఇప్పుడు ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. 
    – కుశలవుడు, గిరిజన రైతు, లంబసింగి 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు